రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..!

Thursday, November 22nd, 2018, 03:40:34 AM IST


తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం దగ్గర్నుండి అభ్యర్థులను ప్రకటించటం వరకు దూకుడు చూపిన తెరాస, ప్రచారంలో కూడా అనూహ్య పద్దతి ఎంచుకుంది.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బరిలో దిగుతున్న నియోజకవర్గాలను ఎంచుకొని తమ ప్రచారాన్ని చేపడుతుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గం అయిన కొడంగల్ లో కేటీఆర్ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ…రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ కు దమ్ముంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై గెలిచి చూపించాలని…అలా చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుంటే….కొడంగల్ లో గెలవకుంటే రాజకీయ సన్యాసానికి రేవంత్‌ సిద్ధమా? అంటే కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్‌ రెడ్డి గాలి మాటలు వదిలి అభివృద్ది పనులు చేసి చూపించాలన్నారు. తెలంగాణ ప్రజలకు మళ్లీ ఢిల్లీ గులాంలు, అమరావతి బాద్‌షాలు అవసరమా? అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. కొడంగల్ ప్రజలు ఎవరి పక్షాన నిలవాలో విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలన్నారు. సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలో.. ప్రజల మధ్య ఉంటే సీఎం కావాలో తేల్చుకోవాలని కేటీఆర్ కొడంగల్ వాసులకు సూచించారు.