కేటీఆర్ హామీ- అమెరికా కాల్పుల ఘటన లో గాయపడ్డ సాయికృష్ణ కి అండగా ఉంటాం.

Tuesday, January 8th, 2019, 06:37:35 PM IST

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అమెరికా దుండగుల కాల్పుల సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సాయికృష్ణ కు పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ కి చెందిన సాయికృష్ణ పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. కానీ అనూహ్యంగా అక్కడ కొందరు దుండగుల చేతిలో కాల్పులకు గురయ్యి, అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వ సహాయ నిమిత్తం సాయికృష్ణ తల్లిదండ్రులు సీఎం క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ గారిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే ఈ విషయం మీద స్పందించిన కేటీఆర్ వారికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, అమెరికాకు వెళ్లేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటామని కేటీఆర్ మాటిచ్చారు. ప్రస్తుతం సాయికృష్ణ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని అయితే పలు శస్త్ర చికిత్సలు ఆయనకు అవసరమని అక్కడ ఉన్న సాయికృష్ణ మిత్రులు తమకు తెలియజేశారని తల్లిదండ్రులు కేటీఆర్ గారికి తెలిపారు.

మరికొంత అవసరం కోసం విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మ స్వరాజ్ ని, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ సీతారాం నాయక్ గారు కలిసారని కేటీఆర్ వారికీ తెలిపారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన అత్యవసర వీసాలను జారీ చేయాల్సిందిగా హైదరాబాద్ లోని అమెరికా కాన్సుల్ జర్నల్ కేథరిన్ హెడ్డా తోనూ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ కి సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుకున్నారు.