కేటిఆర్ మాటలు వింటే నవ్వు రాక ఇంకేం వస్తుంది !

Tuesday, September 18th, 2018, 10:05:10 AM IST

ఉన్నపళంగా అసెంబ్లీని రద్దుచేసేసి ముందస్తు ఎన్నికలని ప్రకటించి కేసిఆర్ అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత జరగాల్సిన ఎన్నికల్ని అధికారాన్ని త్యాగం చేసి మరీ ముందుకు తీసుకొచ్చారు గులాబీ నేతలు. సాధారణ దృష్టితో చూస్తే ఇదొక సాహసోపేతమైన చర్యని, గెలుపుపై టిఆర్ఎస్ పార్టీకున్న ధీమా అని అనిపించినా లోతుగా ఆలోచిస్తే ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని, ఖర్చు చేయాల్సిన కోట్ల రూపాయల ప్రజాధనం గురించి ఆలోచించకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కొంత అహంకార ధోరణిగానే అనిపిస్తుంది.

దీనికి సమాధానంగా కాంగ్రెస్ వలనే ముందస్తుకు వెళుతున్నామని పార్టీ తరపున కేటిఆర్ సమాధానం చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ అడ్డుపడుతోందని, అనవసరంగా తమను ప్రజల ముందు కించపరుస్తున్నారని అందుకే తమను తాము నిరూపించుకునేందుకు ముందస్తుకు సిద్దమయ్యామని కేటిఆర్ అంటున్నారు.

ప్రస్తుత రాజకీయాల్లో అధికార పక్షానికి ప్రతిపక్షం అడుగడుగునా అడ్డు తగలడం, కవ్వింపు విమర్శలకు, చర్యలకు దిగడం కామన్. వాటిని నీరుగారుస్తూ, అభివృద్ధి కార్యక్రమాలతో తమ నిజాయితీని ఎప్పటికప్పుడు ప్రజల ముందు నిరూపించుకోవడం ప్రభుత్వ భాద్యత. అంతేగాని పంతానికి పోయి అసెంబ్లీ ఎన్నికలు అనే మహాకార్యాన్ని ముందుకు తీసుకురావడం ఎంతవరకు సమంజసమో టిఆర్ఎస్ నేతలే ఆలోచించుకోవాలి.