టీహబ్ తెలుసు ఈ వీహాబ్ ఏంటీ కొత్తగా..?

Friday, March 9th, 2018, 09:04:10 AM IST

అభివృద్ధి బాటలో పురుషులతో దూసుకుపోతున్న మహిళలు. వీరికి సపోర్టుగా కొత్తచరిత్ర సృష్టించి ఆవిష్కర్తల రంగంలో ముందడుగు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వీహబ్ మొదటిమెట్టు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. మహిళా సాధికారతకు కట్టుబడి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వమే ముందుకు వచ్చి వీహబ్ పేరుతో పరిశోధనలకు సాయం చేస్తుందని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లో వీహబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన డీఆర్‌డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ టెస్సీ థామస్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఐఐ చైర్మన్ వీ రాజన్న, కలారీ క్యాపిటల్ సంస్థ ఎండీ వాణి కోలా, వీహబ్ సీఈవో దీప్తి రావుల, ఫిక్కి, ఫిక్కి మహిళా విభాగం, కోవె సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వీ హాబ్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మానవ పరిణామక్రమంలో మహిళల్లో సృజనాత్మక శక్తి ఉన్నప్పటికీ వారికి ప్రోత్సాహం దక్కకపోవడం వల్ల వారి ప్రతిభ వెలుగులోకి రాలేదు. కొంత కాలంగా మహిళల శక్తి సామర్థ్యాలు తెలుసుకున్న తెలంగాణా ప్రభుత్వం వారికి తగిన అండదండలు లేకపోవడం వల్ల పలువురు ముందుకురాలేకపోయారు. అందుకే మహిళలకు అండగా నిలువాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. విజేతల్లో ఎక్కువశాతం ఎవరి ప్రోత్సాహం లేకుండానే ఎంతో శ్రమకోర్చి తమ సత్తాను చాటుకున్నవారే ఉన్నారన్నారు. అయితే అలాంటి వారిని మొదటి దశలోనే గుర్తించి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆవిష్కరణల కేంద్రం టీహబ్ ప్రారంభించాం. తక్కువ కాలంలోనే అద్భుతమైన ఫలితాలను సాధించాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో టీహబ్ స్టార్టప్ గెలిచింది. ఇదే స్ఫూర్తితో మహిళలకు ప్రత్యేక ఆవిష్కరణల కేంద్రం ఉండాలని వీహబ్ ఆలోచన చేశాం.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ముగిసేరోజున వీహబ్ ప్రకటన చేశాం. స్వల్పకాలంలోనే ఆ ప్రాజెక్టును ప్రారంభించుకుంటున్నాం అని తెలిపారు. ఆవిష్కరణలు ప్రోత్సహించాలంటే విద్యావిధానంలో కూడా కావలసినన్ని మార్పులూ చేర్పులూ చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచం అంతా సిలికాన్ వ్యాలీలోని ఆవిష్కరణల వైపే ఎందుకు దృష్టిసారించాలి? మిగతా దేశాల్లో ఆవిష్కర్తలకు ప్రోత్సాహం దక్కకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది వివరించారు. చిన్నతనం నుంచే చదువు కేవలం మార్కులకోసమే అన్నట్టు కాకుండా ఆవిష్కరణలను కుడా పాఠ్యాంశంలో భాగం చేయాలి. జూనియర్ కాలేజీ విద్యార్థులకు పరిశోధన చేయడానికి కావాల్సిన అవకాశం కల్పించాలి. దాని ద్వారా మెరుగైన కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. ఎస్‌యూపీడబ్ల్యూ ప్రాజెక్టుకు మార్కు లు కాకుండా నిజమైన పరిశోధనలకు తెలంగాణాలోచోటు కల్పించాలి. వీటితో పాటుగా పాలకులు ఆవిష్కర్తలకు విద్యార్థులకి వెన్నెంటే ఉంటూ భరోసాగా నిలవాలి. అందుకే వీహబ్‌లో రూపొందిన ఆవిష్కరణలకు మొదటి వినియోగదారుడిగా తెలంగాణా ప్రభుత్వం నిలబడింది.

ప్రభుత్వశాఖలకు సంబంధించిన విక్రయాల నిబంధనలను మహిళల కోసం పక్కనపెట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. వీహబ్ దేశానికి, మహిళలను ప్రోత్సహించే రంగానికి ఒక దిశానిర్దేశం చేయాలి. స్ఫూర్తిగా నిలువాలి. ఐటీ రంగానికి సంబంధించిన ఆవిష్కరణలే కాకుండా అన్నిరకాల ఆవిష్కరణలకు వీహబ్ కేంద్రంగా నిలుస్తుంది దానికి కావాల్సిన అవసరాలన్నీ ప్రభుత్వం సమకూర్చుతుంది. అందుకే వీహబ్‌కు ప్రాథమిక పెట్టుబడిగా రూ.15 కోట్లు కేటాయిస్తున్నాం. ఎంపికైన ఆవిష్కర్తలకు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు అందజేస్తాం అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాగా, ఈ కార్యక్రమం సందర్భంగా ఆరు ఒప్పందాలు ఆయా సంస్థల ప్రతినిధులు కుదుర్చుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ, సీఐఐ-ఇండియా ఉమెన్ నెట్‌వర్క్, సేల్స్‌ఫోర్స్, ఐఐఎం బెంగళూరు, ఎన్‌ఐడియా, పీడబ్ల్యూఎల్ కుదుర్చుకున్న ఒప్పందం సంస్థల్లో ఉన్నాయి.

వీహబ్‌తో నీతిఆయోగ్ ఒప్పందం

మరో గొప్ప విషయమేమిటంటే వీహబ్ ఆవిష్కరణ రోజే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నది. మహిళల సాధికారత కోసం నీతి ఆయోగ్ రూపొందించిన నారీశక్తి తమ మొట్టమొదటి ఒప్పందం తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్నదని రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి హబ్‌ను మహిళల కోసం ఏర్పాటుచేసిన తెలంగాణతో తాము జట్టుకట్టడం సంతోషంగా ఉందని, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపినట్టు జయేశ్ రంజన్ వివరించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో గల టీ శాట్ కార్యాలయంలో వీహబ్ కొలువుదీరిందని ఆయన తెలిపారు. టీహబ్2 ఏర్పడిన అనంతరం అక్కడ శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. వీహబ్‌లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. www.wehub.telangana.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments