కేసీఆర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు: కేటీఆర్

Tuesday, February 27th, 2018, 02:29:20 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారికి ఈ రోజు ఉదయం ఎవరు ఊహించని విధంగా ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ఓ విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ సెట్‌ ఉన్న బ్యాగు లోంచి సడన్ గా పొగలు వచ్చాయి. దీంతో షాక్ అయిన భద్రతా సిబ్బంది వెంటనే అలెర్ట్ అయ్యారు. అప్రమత్తమై ఆ బ్యాగును బయటకు పడేశారు. ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం గురించి కొంత మంది సోషల్ మీడియాలో ఆందోళన చెందగా కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి తాను ఫోన్ చేసి అన్ని వివరాలను తెలుసుకున్నట్లు చెబుతూ.. ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి ఆదిలాబాద్ పర్యటనలో ఎలాంటి మార్పు ఉండదని తెలియజేశారు.