కన్నడ రాజకీయం: యడ్యూరప్ప బండారం బయటపెట్టిన కుమారస్వామి..!

Friday, February 8th, 2019, 12:06:44 PM IST

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది, సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఎలాగైనా మోడీని గద్దె దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా కర్ణాటక వేదికగా రాజకీయ దుమారం రేగింది, బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ సీఎం కుమారస్వామి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్పింగ్ ను బయటపెట్టారు, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు యడ్యూరప్ప జరుపుతున్న బేరసారాలు ఆడియో టేపులో రికార్డయ్యాయి. నాగనగౌడ అనే ఓ ఎమ్మెల్యేకు యడ్యూరప్ప రూ.25లక్షలు డబ్బుతో పాటు అతని తండ్రికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు అందులో స్పష్టమౌతోంది.ప్రధాని మోదీ అండదండలతోనే రాష్ట్రంలో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కుమారస్వామి ఆరోపిస్తున్నారు. మోడీకి నైతిక విలువలే గనక ఉంటే, యడ్యూరప్పతో సహా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న నేతలను తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుండి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని మోడీ ఖూనీ చేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి మరింత ఎమ్మెల్యేలను లాగడానికి యడ్యూరప్ప బ్యాచ్ ప్రయత్నిస్తుండటంతో కుమారస్వామి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప బేరసారాలకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్ ను బయటపెట్టింది. ఆడియో క్లిప్పింగ్స్ లో యడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో తమదగ్గరున్న ఆధారాలన్నీ బయటపెడతామని కుమార స్వామి అంటున్నారు, ఈ ఉదంతంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.