118 మంది ఎమ్యెల్యేలతో గవర్నర్ వద్దకు కుమారస్వామి!

Thursday, May 17th, 2018, 01:14:01 AM IST

ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు తీవ్ర ఉత్కంఠతతో మంచి రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే 104 సీట్లు సాధించామని మోడీ సహా బిజేపినేతలు ఆనందంతో చెపుతున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అదనంగా కావలసిన 8 మంది ఎమ్యెల్యేలకోసం ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు నేడు జేడీఎస్ అధినేత కుమారస్వామి మాట్లాడుతూ, తమ పార్టీలోని 12మంది ఎమ్యెల్యేలకు తలా ఒక రూ.100 కోట్లు రొక్కం ఇవ్వజూపి బిజెపి వారిని తనవైపుకు లాక్కోవాలని చూస్తుందని బహిరంగంగానే ఆరోపించారు. అంతేకాక తమపార్టీకి చెందిన ఎమ్యెల్యేలు తమ అనుమతిలేకుండా మరి ఏ ఇతర పార్టీలో చేరడం లేదని స్పష్టంచేశారు. ఇక ఏకంగా నేటి సాయంత్రం ఆయన కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం తమ పార్టీలోని 38మంది, కాంగ్రెస్ కు చెందిన 78మంది, అలానే ఇతరులు 2 మొత్తంగా వెరసి 118మంది ఎమ్యెల్యేలతో కలిసి ఆయన గవర్నర్ వాజుభాయ్ ని కలిసేందుకు బయలుదేరివెళ్లారు.

రాజభవన్ లో కలిసిన ఆయన తనకు 118మంది మద్దతు ఉందని, కావాలంటే వారిని తమ ముందు పెరేడ్ ఏర్పాటు చేసేందుకుకూడా సిద్ధంగా వున్నట్లు ఆయన తెలిపారు. అయితే గవర్నర్ మాత్రం జేడీఎస్, కాంగ్రెస్ కలిపి ఒక 10మంది ఎమ్యెల్యేలతో కలిసి మాట్లాడటానికి అనుమతించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల కమీషనర్ గవర్నర్ కు అంధచేశారు. కాగా మరోవైపు యెడ్యూరప్ప కూడా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ని కలవబోతున్నట్లు సమాచారం. అయితే గవర్నర్ ఏ విధంగా ఆలోచించి ఎవరికి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తారు అనేది ప్రస్తుతం కన్నడనాట తీవ్ర ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది……..

  •  
  •  
  •  
  •  

Comments