వైభవంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం.. వేడుకలో విఐపిలే ఎక్కువ!

Wednesday, May 23rd, 2018, 05:23:30 PM IST

కర్ణాటక ప్రజలు కలలో కూడా ఊహించని నాయకుడు ఇప్పుడు అధికార పీఠం దక్కించుకోవడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ లేదా బీజేపీ వస్తుందని చాలా వరకు ఒక ఐడియాతో ఉన్న కన్నడిగులు జేడీఎస్ ను పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని విధంగా సగంలో సగం ఎమ్మెల్యేలను పొందలేని జేడీఎస్ పార్టీ సభ్యుడు ముఖ్యమంత్రి స్థానాన్ని అందుకున్నాడు. బెంగుళూరులో జేడీఎస్ నేత కుమారస్వామి కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కుమారస్వామికి సీఎం పదవి దక్కడం ఇది రెండవసారి. గతంలో 2006 లో భారత జనతా పార్టీతో పొత్తుపెట్టుకొని సీఎం సీటు దక్కించుకున్నప్పటికీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేదు.

కేవలం 20 నెలలు మాత్రమే ఉండి బీజేపీ తో గోడవలు వచ్చి మద్దతు కోల్పోయారు. అందువల్ల అప్పుడు తొందరగానే రాజీనామా చేశారు. ఇక ఈ రోజు విధాన సౌధ తూర్పుద్వారం మెట్ల వద్ద భారీవేదికపై కుమార స్వామి చేత గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకారానికి జేడీఎస్ నేతలు భారీ ఎత్తున వచ్చారు. కాంగ్రెస్ నేతలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని స్థానిక ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వేడుకలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ – రాహుల్ గాంధీ కూడా ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధులుగా వచ్చారు. దాదాపు మూడు వేల మందికి పైగా విఐపి లు వేడుకలో పాల్గొనడంతో పోలీసులు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇక కుమారస్వామి గవర్నమెంట్ బల నిరూపణ చేసుకున్నాక మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జేడీఎస్ నేతలకు 12 మంత్రి పదవులు. కాంగ్రెస్ కు 22 మంత్రి పదవులు దక్కనున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments