తెలుగు రాష్ట్రాల సీఎంలకు కుమారస్వామి విజ్ఞప్తి!

Thursday, May 17th, 2018, 01:47:57 PM IST

మొన్న విడుదలయిన కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయని చెప్పవచ్చు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఖంగుతిన్న పార్టీలు తామంటే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ముందస్తుగా గవర్నర్ ను కలిసి విన్నవించాయి. అయితే నేడు గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపిని ఆహ్వానించారు. బిజెపి నేత యెడ్యూరప్పతో ఆయన నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. అయితే బిజెపి వారు మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు కావలిసిన బలాన్ని 15రోజుల్లోగా నిరూపించుకోవాలని గోవేర్నర్ సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ విస్తరణ కూడా ఆ తర్వాతే ఉండనుంది. ఇకపోతే బిజెపి ఇంత అధర్మంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే రీతిలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అంటున్నారు. దీనిపై జేడీఎస్ అధినేత కుమారస్వామి మాట్లాడుతూ, బిజెపి పన్నిన ఈ కుట్రపై తాము ధర్మ పోరాటం చేస్తామని, అందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, చంద్రబాబులు కూడా తమకు మద్దతివ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయపార్టీలన్నీ పోరాడవలసిన సమయం ఆసన్నమయిందని, తమ పోరాటానికి అందరి మద్దతు కావాలని ఆయన అన్నారు.

బిజెపి నేతలు తమ పార్టీ ఎమ్యెల్యేలపై ఈడీ అధికారులను ఉసిగొలిపి దాడులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, కేసులు నమోదుచేసి జైలులో పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. నిజానికి ఇదివరకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కుమారస్వామి, దేవెగౌడలను కలిశారు కూడా, కాగా నేడు ఆయన వారికి మద్దతు అవకాశం ఉందని సమాచారం. ఇకపోతే విభజ హామీలు, ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మోసం చేసిన బిజెపితో స్నేహాన్ని తెగతెంపులు చేసుకున్న టిడిపి కూడా ప్రస్తుతం బిజెపిపై గుర్రుగా వుంది, అవసరమైతే వారుకూడా కుమారస్వామి కి మద్దతు ఇస్తారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి అనుకున్న తరుణంలో గవర్నర్ బిజెపికి ఆ అవకాశం ఇవ్వడంతో బిజెపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు……..

  •  
  •  
  •  
  •  

Comments