కర్నూలు టిడిపిలో ముసలం..పార్టీకి గుడ్ బై చెప్పనున్న సీనియర్లు..?

Sunday, February 19th, 2017, 10:50:11 PM IST


కర్నూలు జిల్లా రాజకీయాలు టిడిపికి తీవ్ర నష్టాన్ని కలిగించేలా సాగుతున్నాయి. ఇప్పటికే టిడిపి నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి వైసిపిలోకి వెళ్లడంతో మరికొంతమంది అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.వీరంతా పార్టీ సీనియర్లు కీలకనేతలు కావడంతో అధిష్టానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి టిడిపిలోకి రావడం, అతనికి మంత్రి పదవి దక్కనున్నట్లు లీకులు రావడంతో అతని వ్యతిరేక వర్గం, అసంతృప్తులు వైసిపి బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తెలుగు దేశం పార్టీ కంటే వైసిపి బలంగా ఉంది. టిడిపిని జిల్లాలో బలోపేతం చేయడనికి చంద్రబాబు అప్పట్లో వలసలను ఆహ్వానించారు.

కానీ ఆ వ్యూహం బెడిసి కొట్టినట్లు కనిపిస్తోంది.జిల్లాలో భూమా వర్గానికి వ్యతిరేకులైన శిల్పా బ్రదర్స్ వర్గం త్వరలో టిడిపికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శిల్పా బ్రదర్స్ మొదటి నుంచి భూమా చేరికని వ్యతిరేకిస్తున్నారు. కాగా తాజాగా అతనికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుండడంతో టిడిపి జిల్లా అధ్యక్షుడైన శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో చంద్రబాబు వారిని బుజ్జగించాడనికి కర్నూలు ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డిని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. శిల్పా బ్రదర్స్ పార్టీని వీడితే జిల్లాలో టిడిపి బలం బాగా తగ్గిపోయినట్లే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.