లగడపాటి మరో షాక్ : గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి..!

Thursday, December 6th, 2018, 09:29:10 AM IST

ఆంధ్రా ఆక్టోపస్, సర్వేల సంచలనం లగడపాటి రాజగోపాల్ మరో షాకింగ్ లీక్ ఇచ్చాడు, తెరాస అధినేత కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఓడిపోనున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కేసీఆర్ ఓడిపోతారని చెప్పారు, ఈ విషయం నేను చెప్పటం కాదు, అక్కడి పోలీసులే చెప్పారని అన్నారు. ఇటీవల తానూ గజ్వేల్ వెళ్లగా తన కారును తనిఖీ చేసిన పోలీసులు తనను గుర్తు పట్టి మాట్లాడారని తెలిపారు. పోలీసులు తన సర్వే గురించి అడిగారని, ఆ సమయంలో గజ్వేల్ పరిస్థితి ఎలా ఉందని అడుగగా, “ఇక్కడ కేసీఆర్ ఓడిపోతారని వారు అన్నారని చెప్పాడు, కేసీఆర్ గెలుస్తాడని లగడపాటి అనగా, కావాలంటే డిసెంబర్ 11న చుడండి అని పోలీసులు నమ్మకంగా చెప్పారని అన్నారు.

గత రెండు రోజులపాటు మీడియా ముందుకు వచ్చి తన సర్వేలలోని సంచలన విషయాలు బయటపెడుతున్న లగడపాటి, ఈ ఎన్నికల్లో కూటమిదే విజయం అని మరోసారి తేల్చి చెప్పారు. కేసీఆర్ సిట్టింగులందరికి సీట్లు ఇవ్వటమే తెరాస కొంప ముంచిందని అన్నారు. పొత్తుకు సిద్ధం అన్న టీడీపీతో కలిసుంటే తెరాసకు లాభం చేకూరేది అని విశ్లేషించారు. మొత్తానికి లగడపాటి కేసీఆర్ ఓడిపోతారని ప్రకటించటం సంచలనంగా మారింది. అయితే కేసీఆర్ ఓడిపోతారని తన సర్వేలో తేలినట్టు చెప్పకపోవటం గమనార్హం.