కూట‌మి వెనుక‌ ల‌గ‌డ‌పాటి హస్తం!!

Sunday, November 11th, 2018, 10:00:03 AM IST

తెలంగాణ కాంగ్రెస్ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు గులాంగిరీ చేస్తోంది, మ‌మాకూట‌మి పేరుతో తెలంగాణ‌లో మ‌ళ్లీ బాబు అరాచ‌కం సృష్టించ‌డానికి ఎత్తులు వేస్తున్నాడు. కూట‌మికి పైకి బాస్‌లా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తున్నా డైరెక్ష‌న్ మాత్రం అమ‌రావ‌తి నుంచే“నంటూ గడిచిన కొన్ని రోజులుగా తెరాస ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అశోక్ గెహ్లాట్ శ‌నివారం ప్ర‌త్యేకంగా అమ‌రావ‌తికి వ‌చ్చి చంద్ర‌బాబును క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

తెలంగాణ‌లోని సీట్ల కేటాయింపుపై బాబు ఆమోదం కోస‌మే అశోక్ గెహ్లాట్ అమ‌రావ‌తి చేరుకోవ‌డం, అత‌డు ఫైన‌ల్ చేసిన సీట్ల‌ను ఆదివారం ఫైన‌ల్ చేస్తుండ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇంకా షాకింగ్ విష‌యం ఏంటంటే తెలంగాణ బిల్లు స‌మ‌యంలో పెప్ప‌ర్ స్ప్రేతో హ‌ల్‌చ‌ల్ చేసి ఆ త‌రువాత రాజ‌కీయ జీవితానికి దూర‌మైన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తెలంగాణ‌లో కాంగ్రెస్‌, టీడీపీ జ‌ట్టుక‌ట్టి కూట‌మిగా ఏర్ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌కుడ‌నే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం బ‌య‌టికి రావ‌డం తెరాస వ‌ర్గాల‌ను ఆగ్ర‌హానికి గురిచేస్తోంది.

తెలంగాణ విఫ‌ల ప్ర‌య‌త్నం అని నిరూపించ‌డంలో భాగంగానే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఏపీ సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి కొత్త ఎత్తుకు శ్రీ‌కారం చుట్టార‌ని, దీన్ని తెలంగాణ స‌మాజం చూస్తూ ఊరుకోద‌ని తెరాస శ్రేణులు ల‌డ‌గ‌పాటి రాజ‌గోపాల్‌, చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదిలా వుంటే కాంగ్రెస్ పెద్ద‌లు చంద్ర‌బాబును క‌ల‌వ‌డం ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీకి కేంద్ర అదిష్టాన‌మే ఇలా దాసోహ‌మంటూ ఏపీలో టీడీపీతో పొత్తుకు సిద్ధ‌మంటూ సంకేతాలివ్వ‌డం అంటే ఏపీ కాంగ్రెస్ ను బ‌లిప‌శువుగా మార్చ‌డ‌మేన‌ని భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.