సవాల్ గా మారిన ‘భూ’మ్..!

Saturday, September 27th, 2014, 03:16:52 PM IST

aprajadani
ఏపి రాజధాని నిర్మాణానికి భూసేకరణ అంశం పెద్ద సవాల్ గా మారబోతుంది. ప్రభుత్వం తొలి విడత పాతికవేల ఎకరాల భూమి కావాలని చెబుతుండడం క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటడంతో ఈ సమస్య మొదలయింది. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తెరపైకి తీసుకు వచ్చినా రాజధాని మంత్రుల కమిటీ మాత్రం భూసేకరణ అంత సులువు కాదనే అభిప్రాయ పడుతుంది.

ఏపి క్యాపిటల్ కోసం భూసేకరణ అంశం అనుకున్నంత ఈజీ కాదని తేలిపోయింది. ప్రభుత్వం రాజధానితో పాటు మౌలిక వసతులు, విద్యా, వైధ్య సంస్దలను ఒకే సారి నిర్మాంచాలని భావిస్తున్న తరుణంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతుల నుంచి భూమిని సేకరించడం అంత సులువు కాదనే అభిప్రాయానికి వచ్చింది. దీనికి కారణం ఆ రెండు జిల్లాలలో భూముల ధరలు ఆకాశాన్నంటడమే. విజయవాడ రాజధానిగా ప్రకటన వచ్చిన తరువాత విజయవాడ చుట్టు ప్రక్కల కనీసం నలబై కిలోమీటర్ల దూరం వరకు ఎకరం కోటి నుంచి పది కోట్లుకు చేరింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ భూమి కనీసం పదివేల ఎకరాలు కూడా లేదు. అలాగే అటవి శాఖా భూములు ఉన్నప్పటికి అవి పెద్దగా ఉపయోగ పడే పరిస్దితి లేదు. ప్రభుత్వం చెబుతున్న ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతులు భూములు ఇచ్చేందుకు ఎంతమేరకు ముందుకు వస్తారనేది ప్రశ్నార్దకంగా మారింది.

అయితే ప్రభుత్వం మాత్రం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతలు భూములు ఇస్తే వాటిని అభివృద్ది చేయడంతో పాటు మంచి లాభాల బాట పట్టిస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే కృష్ణాజిల్లాల్లో అడ్డగోలు రిజిస్ట్రేషన్లకు బ్రేక్ వేసిన సర్కార్ ఇష్టాను సారం లే అవుట్లు వేసేందుకు వీలు లేకుండా చెక్ పెట్టింది. కాబట్టి రైతులకు ముందు అవగాహన కల్పించి వారి నుండి భూసేకరణ జరుపుతామని మంత్రి వర్గం చెబుతోంది.

మొత్తం మీద రాజధాని నిర్మాణాన్ని పెద్ద సవాల్ గా తీసుకున్న రాజధాని మంత్రుల కమిటి ప్రధానంగా భూసేకరణపై దృష్టి పెట్టింది. ప్రతి పదిహేను రోజులకు ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వాల్సి ఉండడంతో ఎక్కడా జాప్యం జరగకుండా జాగ్రత్తలు పడుతుంది. కనీసం వచ్చే దసరా నాటికి పూర్తి స్దాయిలో భూసేకరణ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. సో మరి మంత్రుల విజ్ఞాపనలకు రైతులు ఏ విధంగా సహకరిస్తారో వేచి చూడాలి.