ఎన్నిక‌ల ముందు కోర్టుల్లో పిటిష‌న్‌లేంటో?

Friday, October 5th, 2018, 11:57:36 PM IST

ఎన్నిక‌ల‌కు జేగంట మోగిన‌ట్టే ఇక‌. నేడో రేపో.. అన్న‌ట్టే ఉంది సీను. ఆ ఒక్క ప్ర‌క‌ట‌న కోస‌మే ఉత్కంఠగా వేచి చూస్తున్నారంతా. తెలంగాణ ఎన్నిక‌ల‌కు ఇక క్లియ‌ర్ క‌ట్‌గా డెసిష‌న్ మేకింగ్ ఏంటో తేలిపోయే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అందుకు అన్నివైపుల నుంచి ఎన్నిక‌ల సంఘం క్లియ‌రెన్స్ తేనుంది. ఈ శ‌నివారం ఢిల్లీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్ని వివ‌రాల్ని అందించ‌నున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జరిపే సమీక్షలో పాల్గొని ఆయ‌న‌ క్లారిటీ ఇచ్చేస్తారు. ఇప్ప‌టికే స‌రి చేసిన‌ ఓటర్ లిస్ట్ పై తుది నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తారాయ‌న‌. అలాగే ఎన్నికల నిర్వహణకు ఎలాంటి జాగ్రర్థాలు తీసుకున్నారు? తెలంగాణ వ్యాప్తంగా ఎల‌క్ష‌న్ జ‌రిపేందుకు ఎంత మంది సిబ్బంది కావాలి? శాంతిభద్రతలకు ఎంతమంది పోలీస్ బ‌ల‌గం అవసరం?.. త‌దిత‌ర వివ‌రాలు అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని? న‌క్స‌ల్స్ ప్రభావిత ప్రాంతాలేవి? త‌దిత‌ర‌ సమగ్ర వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు ఉంచుతారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో పూర్తి సంతృప్తికర వాతావ‌ర‌ణం ఉంటే వెంట‌నే ప్ర‌క‌ట‌న వెలువ‌డినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న మాటా వినిపిస్తోంది.

మ‌రోవైపు తెలంగాణ ఓటర్ల జాబితా ప్రకటన గడువును పొడిగించాలని కోరుతూ మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయించే అధికారం హైకోర్టుకు వుందని సుప్రీం వ్యాఖ్యానించ‌డంతో అది కాస్తా అడ్డు త‌గిలేట్టే ఉంద‌న్న వాద‌నా మ‌రోవైపు వినిపిస్తోంది. పిటిషనర్ రేపే హైకోర్టును ఆశ్రయించవచ్చ‌ని సుప్రీం స్ప‌ష్ఠ‌త‌నివ్వ‌డంతో ఏం జ‌ర‌గ‌బోతోందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. ఈ నెల 8తోనే ఓట‌ర్ల జాబితా లెక్క తేల్చే గ‌డువు ముగుస్తోంది. ఈలోగానే విచార‌ణ పూర్త‌వ్వాల్సి ఉంది. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన అందరికీ ఓటు హక్కు కల్పించాలనీ కోరుతూ దాఖలైన పిటిషన్‌ని కూడా శశిధర్ రెడ్డి పిటిషన్ కే జత చేసింది సుప్రీం. పిటిషనర్ అభ్యర్థన లోని యోగ్యత ఆధారంగా అవసరమైతే గడువు పొడిగించే అధికారం హైకోర్టుకు వుంద‌ని సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే ఈ అభ్యంత‌రాల్ని హైకోర్టు ఇప్ప‌టికే కొట్టి వేసింద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న్ సుప్రీంకి స్ప‌ష్టం చేసింది. ఆ కేసులో ఓటర్ల గల్లంతు, జాబితా పై విచారణ జరగలేదని కోర్టు కు మర్రి శశిధర్ రెడ్డి తరుపు న్యాయవాది వాదించ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. దీంతో తుది తీర్పు విష‌యంలోనూ, ఎన్నిక‌ల‌పై కాస్తంత అస్ప‌ష్ట‌త నెల‌కొంది.