తాజా వార్త : మాజీ ప్రధాని వాజపేయి మరణం? వాట్సాప్ లో న్యూస్ వైరల్

Friday, March 30th, 2018, 10:05:50 PM IST

ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం అవసరంగా మారడం అందునా ఇంటర్నెట్ ధరలు తగ్గడంతో ప్రతిఒక్కరు సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. అది మనకు మేలు చేస్తున్న, కొంత కీడు కూడా చేస్తోంది. ఏవేవో న్యూస్ లు రోజు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తూ ఉంటాయి. అయితే అందులో నిజమెంతో అబద్దమెంతో మనకు తెలియదు. ఒకరు పుకారు రేపితే దాన్ని పట్టుకుని మరికొందరు రాద్దాంతం చేస్తున్న విషయాలు తరచు చూస్తున్నాం. ఆ మధ్య చంద్రముఖి డైరెక్టర్ పి వాసు మరణించినట్లు వాట్సాప్ లో వార్తలు షికారు చేయడంతో చివరికి ఆయనే స్వయంగా ఒక వీడియో విడుదల చేసే నేను బ్రతికే వున్నా నన్ను చంపకండి అంటూ చెప్పుకొచ్చారు.

అలానే రెండు రోజుల క్రిందట అలనాటి నటి జయంతి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంటే, ఆమె మరణించారని ఏకంగా కొన్ని మీడియాల్లో వార్తలు షికారు చేశాయి. అయితే ఆమె బ్రతికేవున్నట్లు ఆమె కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. ఇక ప్రస్తుతం నేడు భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ కీర్తి శిఖరాల్లో ఒకరైన అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించినట్లు సోషల్‌మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల ద్వారా షేర్‌ అవుతోన్న పోస్టు మరణానికి రకరకాల కారణాలను వెల్లువెత్తుతున్నాయి. అయితే వాస్తవానికి ఆయన చక్కగా తన తన జీవితాన్ని గడుపుతున్నారు.

కాగా 2015లో కూడా ఇలానే వాజ్‌పేయి ఇక లేరంటూ నకిలీ వార్తలు వెలువడ్డాయి. సహోధ్యాపకుడు అందించిన సమాచారంతో స్కూల్‌కు సెలవు ప్రకటించిన ఓ హెడ్‌మాస్టర్‌ అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు. స్కూల్‌కు సెలవు ప్రకటించిన ఆ హెడ్‌ మాస్టర్‌పై కలెక్టర్‌ చర్యలు కూడా తీసుకున్నారు. దేశానికి ఎన్నో సేవలు అందించిన వాజ్‌పేయి మరణించారంటూ ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ కావడం నిజంగా దురదృష్టకరం. భారత ప్రధానిగా పని చేసిన వాజ్‌పేయి ఉత్తమ పార్లమెంటెరియన్‌గా అవార్డును అందుకున్నారు కూడా. కాబట్టి ఇకనైనా ఇలాంటి న్యూస్ పోస్ట్ చేసేముందు అది ఎంతవరకు నిజమో తెలుసుకుని పోస్ట్ చేస్తే బాగుంటుంది నిపుణులు అంటున్నారు….