తాజా వార్త : భారత్ కు చేరుకున్న ఆ 38 మంది మృతదేహాలు!

Monday, April 2nd, 2018, 03:55:14 PM IST

దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఇరాక్ లో కిడ్నప్ కు గురైన 38 మంది భారతీయులు కిడ్నాపర్ల చెరలో క్షేమంగా ఉంటారని భావించిన భారత ప్రభుత్వం ఆశలు అడియాసలయ్యాయి. వారు మరణించినట్లు తెలియడంతో
ఎట్టకేలకు వారి మృతదేహాలను భారత్‌కు తీసుకువచ్చారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో మృతదేహాలను పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్‌ వెల్లడించారు. వారి మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఆదివారం వీకే సింగ్‌ ఐఏఎఫ్‌ విమానంలో ఇరాక్‌లోని మోసుల్‌ ప్రాంతానికి వెళ్లారు.

చనిపోయిన వారిలో 27 మంది పంజాబ్‌ కు చెందిన వారుకాగా మరో నలుగురు బిహార్‌ వాసులుగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం ఇరాక్‌లోని మోసుల్‌ నగరం వెళ్లి కూలీలుగా పనిచేస్తున్న ఓ భారతీయుల బృందం 2014లో కిడ్నాప్‌కు గురైంది. అప్పటి నుంచి వీరి ఆచూకీ తెలియరాలేదు. వీరిని విడిపించేందుకు భారత ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. కాగా, ఆ కిడ్నాప్ అయిన వారిలో ఒకరైన హర్జిత్‌ మాసీ అనే వ్యక్తి ఇస్లామిక్‌ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. తరువాత ఆయన కొన్ని కీలక విషయాలు చెప్పారు. తనతో పాటు బందీలుగా ఉన్న మిగతావారిని బాదుష్‌ సమీపంలోని ఎడారిలో క్రూరంగా చంపేశారని అన్నారు.

అయితే హర్జిత్‌ వ్యాఖ్యలను ప్రభుత్వం తోసిపుచ్చింది. సరైన ధ్రువీకరణ లేకుండా వారంతా చనిపోయారని భావించడం సరికాదని పేర్కొంది. ఇదిలా ఉండగా, గతేడాది జులైలో మోసుల్‌ నగరంలో ఒకేచోట వందల సంఖ్యలో సామూహిక సమాధులు ఉన్నట్లు గుర్తించిన అక్కడి అధికారులు, ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో 39 మంది భారతీయులు చనిపోయినట్లు తేలింది. అయితే ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులే వీరిని చంపేసినట్లు చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు భారత ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు సుష్మ స్వరాజ్ అన్నారు…..