ఉపఎన్నికల్లో బీజేపీకి భారీ దెబ్బ.. కారణం అదేనా?

Thursday, May 31st, 2018, 04:59:25 PM IST

భారత జనతా పార్టీ గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోయినప్పటికీ కర్ణాటక ఎన్నికలు ఒక్కసారిగా బోల్తా కొట్టించాయి. ఎక్కువ స్థానాలనే గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ వ్యూహానికి తలొగ్గక తప్పలేదు. ఇక ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో రాజేశ్వరి నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ మెజారితో గెలిచింది. అలాగే మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానంలో కూడా బీజేపీని కాంగ్రెస్‌ పార్టీ గట్టిదెబ్బే కొట్టింది. బీహార్ లో ఆర్జేడీ అభ్యర్థి ముందు బీజేపీ అభ్యర్థి దారుణంగా ఓడిపోయాడు.

ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌ – కేరళలోని చెన్‌గన్నూర్‌ నియోజక వర్గాల్లో స్థానికంగా బలంగా ఉన్న పార్టీలదే హావా కొనసాగింది. అయితే బీహార్ లో కచ్చితంగా గెలుపు తమదే అనుకున్న జెడియు – బీజేపీ కూటమికి ఓటమి తప్పలేదు. ఆర్జేడీ అభ్యర్థి అద్భుత విజయాన్ని అందుకొని అధికార పార్టీకి షాక్ ఇచ్చాడు. అయితే ఉప ఎన్నికల ఫలితాలతో ప్రజలు బీజేపీ ని వ్యతిరేకిస్తున్నారనడానికి సాక్షాలు అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇటీవల పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడం వల్లనే భారత జనతా పార్టీకి ఉప ఎన్నికల్లో ఓటమి దక్కిందని బీజేపీ మిత్ర పక్ష జెడియు నేత త్యాగి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు బీజేపీ ఓటమికి కాంగ్రెస్ నేతల్లో ఆనందాలు నెలకొన్నాయి. వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సంబరాలు చేసుకుంటున్నారు.