గులాబీ దళంలో గుబులు మొదలైంది..!

Friday, September 5th, 2014, 05:00:14 PM IST


టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం వలసలతో ఫుల్ జోష్ మీద ఉంది. ఇతర పార్టీల్లోని కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి నేతల వరకు టీఆర్ఎస్ బాట పట్టడంతో మూడు చేరికలు.. ఆరుగురు నాయకులుగా కళకళలాడుతోంది.అయితే ఇప్పటికే ఆ స్థానాల్లో ఉన్న నేతల రాజకీయ ఫ్యూచర్ అగమ్యగోచరంగా తయారైంది. టీఆర్ఎస్ లోనే కొనసాగాలా వద్దా అనే అంశంపై తర్జనభర్జనపడుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ 2014లో సాధారణ ఎన్నికల్లో ఎలాగైన అధికారం చేపట్టడానికి భారీ స్థాయిలో మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముందే పెద్ద ఎత్తున టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ బాట పట్టి గులాబీ తోటలో చేరారు. పక్కా ప్లానింగ్, ప్రచారంతో ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టిన టిఆర్ఎస్ అంతటితో ఆగకుండా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలను నామమాత్రం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తాను బలహీనంగా ఉన్న చోట బలోపేతం కావడం, బలంగా ఉన్న చోట ప్రతిపక్షాల్లో ముఖ్యనేతలు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాపై దృష్టి సారించిన టిఆర్ఎస్ అక్కడ వైసీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించడంతో పాటు ఇప్పుడు జిల్లాలో బలమైన టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఇవాళ గులాబీ కండువా కప్పుతోంది. ఆయనతో పాటు జిల్లాలో ముఖ్య నేతలను కూడా ఆకర్షించింది.

పార్టీ బలోపేతానికి టిఆర్ఎస్ అధినాయకత్వం చేస్తున్న కృషి బాగానే ఉంది. అయితే అదే సమయంలో పార్టీ కోసం ఇన్నాళ్లు పనిచేసిన నాయకుల పరిస్థితే ప్రశ్నార్థకంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి దివంగత పీజేఆర్ కూతురు విజయారెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. ఆమె రాకతో ఇన్ని రోజులు ఈ నియోజక వర్గ ఇన్ ఛార్జీగా పనిచేసిన మర్రి జనార్ధన్ రెడ్డి నామమాత్రమయ్యారు. విజయారెడ్డి గతంలోనే వస్తే ఎమ్మెల్యే అయి ఉండేవారన్న నాయిని మాటలతో ఇక తన భవిష్యత్ ఏమిటో జనార్ధన్ రెడ్డికి అర్ధమవడంతో.. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అటు తాజాగా.. ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన అనుచరులు భారీ స్థాయిలో పార్టీలో చేరుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఉద్యమాన్ని నడిపించిన నేతలు తమ భవిష్యత్ ఏమిటని వెతుక్కునే పరిస్థితుల్లో పడ్డారు. ఉద్యమంలో తమను కొట్టించి, కేసులు పెట్టించిన నేతలు ఇప్పుడు తమకు హుకుంలు జారీ చేసే స్థాయిలో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల నుంచి ఖమ్మం జిల్లా బాధ్యతలను ఇన్ని రోజులు జలగం వెంకట్రావుకు అప్పగించిన టిఆర్ఎస్ ఇప్పుడు ఆ బాధ్యతలను తుమ్మలకు అప్పగించనుంది. దీంతో జలగం, ఆయన అనుచరగణం తుమ్మలతో కలవలేక, పార్టీని వీడలేక అయోమయంలో ఉన్నారనే చర్చ జరుగుతోంది.

ఇక..వీరితో పాటు త్వరలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తలసానిపై పోటీ చేసిన టిఆర్ఎస్ నియోజక వర్గ ఇన్ ఛార్జీ దండే విఠల్ ఇక తలసాని కింద పనిచేయాల్సిందే. ఉద్యమంలో ఎన్నడూ కలిసి రాని తలసాని, ఇప్పుడు ఉద్యమ నాయకుడుగా వ్యవహరించడాన్ని అక్కడి నేతలు స్వాగతించలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా పార్టీలో చేరుతారని వార్తలు వినిపిస్తుండటంతో అక్కడి పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా వలస నేతలకు వల వేయడం వల్లక.. ఉన్న నేతలను పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా టీఆర్ఎస్ పరిస్థితి ఉందని గుసగుసలాడుతున్నారు.

కొత్త నీరు రావడం పాత నీరు పోవడం సహజమే అయినా.. టీఆర్ఎస్ లో మాత్రం వలస నేతల రాకతో ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన నేతల ఉనికి ప్రశ్నార్థకం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మున్ముందు భవిష్యత్ లో ఈ పరిణామం ఎటు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.