లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అవుట్… బ్యాంకులదే గెలుపు

Wednesday, May 9th, 2018, 09:59:27 PM IST

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 17 భారతీయ బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగవేసి 2016 మార్చి 2న దేశం విడిచి లండన్కు పారిపోయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. మాల్యా అప్పగింతకు ఎడతెగని పోరాటం చేస్తున్న సంగతీ విదితమే. గతేడాది ఏప్రిల్ 18న అరెస్టు అయిన మాల్యా.. ప్రస్తుతం బెయిల్పై బయట తిరుగుతున్నాడు.అయితే విజయ్ మాల్యా వ్యవహారంలో భారతీయ బ్యాంకులు గొప్ప విజయాన్ని అందుకున్నాయి. రూ.10000 కోట్లకుపైగా వసూళ్లను కోరుతూ బ్రిటన్ కోర్టులో 13 దేశీయ బ్యాంకులు వేసిన దావా (లాస్యూట్)లో మాల్యా ఓడిపోయాడు. ఈ మేరకు లండన్ కోర్టు తీర్పు ఇచ్చింది.

మాల్యా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతకు సంబంధించి ఐడీబీఐ బ్యాంక్సహా అన్ని బ్యాంకులు.. భారతీయ కోర్టు ఆదేశాలను ఇక నిరభ్యంతరంగా అమలు చేసుకోవచ్చని కోర్టు న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా స్పష్టం చేశారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా మాల్యాకున్న ఆస్తుల్ని స్తంభింపజేయాలనే ఆదేశాన్ని తోసిపుచ్చేందుకూ ఆయన నిరాకరించారు. చివరకు ఈ తీర్పుపై అప్పీల్ చేయడానికీ అంగీకరించలేదు. దీంతో మాల్యాకు గట్టి దెబ్బే తగిలినట్లయింది. తాజా తీర్పు భారతీయ రుణ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను తక్షణమే అమలు చేసేందుకు దోహదపడుతుందని ఈ కేసులో బ్యాంకర్ల తరఫున లండన్ కోర్టులో వాదిస్తున్న టీఎల్టీ లా సంస్థకు చెందిన అటార్నీ (న్యాయవాదులు)లు చెప్పారు. మరోవైపు విచారణ అనంతరం తీర్పుపై మాట్లాడేందుకు మాల్యా తరఫు న్యాయవాదులు నిరాకరించారు.

ఇదిలాఉండగా…యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) ప్రమోటర్ సంస్థలకు చెందిన మరో 4.13 కోట్లకుపైగా షేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఈ మేరకు మంగళవారం యూబీఎల్ స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. ఈ షేర్లు 15.63 శాతంతో సమానమన్న యూబీఎల్.. తాజా స్వాధీనంతో కంపెనీలో ఈడీ వద్దనున్న షేర్లు 16.15 శాతానికి చేరుకున్నాయని వివరించింది. మొత్తం 8 ప్రమోటర్ కంపెనీల షేర్లివి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణ ఎగవేత కేసులో ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ షేర్ల జప్తు జరుగుతున్నది. సెబీ ఆదేశంతో విజయ్ మాల్యాను గతేడాది డైరెక్టర్ హోదా నుంచి యూబీఎల్ తప్పించిన సంగతి విదితమే.

Comments