నేడే ఎన్నికల నగారా – కసరత్తు మొదలెట్టిన ఈసీ..!

Sunday, March 10th, 2019, 12:29:39 PM IST

2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణం దేశవ్యాప్తంగా రాజకీయం వేడెక్కుతోంది, జాతీయ పార్టీల నాయకులంతా రాష్ట్ర పర్యటనలతో రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమౌతోంది,లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటలకు ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం నిర్వహిస్తుందని సమాచారం అందటంతో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

షెడ్యూల్‌ విడుదలైన మరుక్షణమే కోడ్‌ అమల్లోకి వస్తుంది. ఏపీతోపాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.ఈ ఎన్నికలను ఈసీ 9 లేదా 10 విడతల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల నిర్వహణకు ఉండబోయే ఇబ్బందులను పరిశీలించి తగు చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.