మంగళగిరిపై లోకేష్ గురి?

Wednesday, July 11th, 2018, 02:56:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తనయుడు మరియు ఏపీ ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ త్వరలో విస్తృతంగా రాష్ట్ర పర్యటన చేపడుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆయన్నీ ఎలాగైనా ప్రజలకు చేరువ చేయాలని చూస్తున్నారు తండ్రి చంద్రబాబు. అయితే దీని వెనుక అసలు విషయం ఒకటి ఉందనేది రాజకీయ పక్షాల మాట. విషయం ఏమిటంటే, ఈ విధంగా రాష్ట్ర పర్యటన చేపడితే, పనిలో పనిగా ప్రజలకు ఆయన మరింత చేరువవడంతోపాటు రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని చంద్రబాబు భావించారట. అంతేకాదు, ఇప్పటికే లోకేష్ పోటీ చేయబోయే నియోజకవర్గాల ఎంపిక కూడా పూర్తి అయిందని, మెజారిటీ సభ్యులు అయన మంగళగిరి నుండి పోటీ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఆ మేరకు లోకేష్ మరియు చంద్రబాబు ఇద్దరు కూడా కొంత సుదీర్ఘ పరిశీలన మరియు సీనియర్ల సలహా మేరకు మంగళగిరి నుండి పోటీ చేయడానికి ఎక్కువ సుముఖత చూపుతున్నారట.

అదీ కాక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయి, అమరావతి రాజధానిగా ఏర్పడ్డాక రాజకీయనాయకులు, మరియు ప్రముఖులు రానున్న రోజుల్లో ఆ చుట్టుప్రక్కలి ప్రాంతాలైన మంగళగిరి, కాజా, తాడేపల్లి గ్రామాల్లోనే ఎక్కువగా తమ స్థిర నివాసం ఏర్పరుచుకోవడానికి ఇష్టపడుతున్నారట. మరియు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పలు కంపెనీల స్థాపనకు కూడా ఏపీ ప్రభుత్వం యోచిస్తుండడం కూడా మరొక కారణంగా చెపుతున్నారు. అంతే కాక ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం నాయకులు గెలిచిన శాతం కూడా చాలా తక్కువని, ఏ విధంగా చూసుకున్నా ఈ సారి ఎలాగైనా మంగళగిరిలో తమ జెండా పాతాలని టిడిపి శ్రేణులు కృత నిశ్చయంతో ఉన్నాయని సమాచారం. కాగా లోకేష్ ఎక్కువ శాతం ఇక్కడి నుండే పోటీ చేస్తారనే వార్త ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలం రేపుతోంది. అయితే రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి మరి……

  •  
  •  
  •  
  •  

Comments