విశాఖ రైల్వేజోన్ ఆశ‌లు .. ఇంకా స‌జీవం!!

Thursday, November 3rd, 2016, 03:45:32 AM IST

babu-and-suresh-prabhu
ప్ర‌త్యేక హోదాతో పాటు విశాఖ రైల్వేజోన్ అంశం ఇటీవ‌లి కాలంలో వార్త‌ల్లో న‌లిగింది. అయితే కేంద్రం మొండి వైఖ‌రితో అస‌లు విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించింది. రైల్వే జోన్ విష‌యంలో ఏ ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఇందులో ప్ర‌త్యేక హోదా విష‌యంలో తేదేపా అధినేత చంద్ర‌బాబు నాయుడు లాలూచీ ప‌డిపోయారు. కేంద్రం చెప్పిన మాట‌కే త‌లూపేసి ప్యాకేజీతో స‌రిపెట్టుకున్నారు. అయితే విశాఖ ప్ర‌త్యేక రైల్వే జోన్ విష‌యంలో మాత్రం బాబు రాజీకి రాలేద‌ని అంటున్నారు. ఇటీవ‌లే అమ‌రావ‌తిలో ప్రభుత్వ భవనాల సముదాయానికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేసిన‌ప్పుడు.. విశాఖ రైల్వే జోన్ వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు సీఎం. ఏపీ నుంచే రాజ్య స‌భ ఎంపీగా ఉన్న సురేష్ ప్ర‌భుకి ఆ సంద‌ర్భంలో రైల్వే జోన్ ఆవ‌శ్య‌క‌త‌ను , ఉత్త‌రాంధ్ర ఓట్ల ప్రాధాన్య‌త‌ను వివ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌నం గెల‌వాలంటే ఇవ్వాల్సిందేన‌ని బాబు .. స‌ద‌రు ఎంపీకి చెప్పారుట‌.

అందుకే ఇప్ప‌టికీ కేంద్రం ఈ విష‌యంపై క‌స‌ర‌త్తు చేస్తూనే ఉంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే రైల్వే బ‌డ్జెట్‌కు ముందు లేదా 2017లో ఈ విష‌యంపై ఏదో ఒక‌టి ప్ర‌క‌టించే ఛాన్సుంద‌ని అంటున్నారు. ఒక‌వేళ అందుకు భాజపా ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తే ఉత్త‌రాంధ్ర‌లో బ‌లం పెంచుకోవ‌డానికి ఛాన్సుంటుంది. వ్య‌తిరేక‌త నుంచి బైట‌ప‌డే సీన్ వ‌స్తుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇప్ప‌టికైతే విశాఖ రైల్వే జోన్‌పై ఆశ‌లు స‌జీవం.