అతిపొడవైన ఆత్రేయపురం పూతరేకు!

Friday, August 10th, 2018, 03:00:30 AM IST


పూత రేకులు అంటే మనకు ఆత్రేయపురం గుర్తుకు వస్తుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే పూతరేకును ఒక్కసారి తింటే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. కొన్ని దేశాల్లో విదేశీయులకు కూడా ఈ స్వీట్ పై మక్కువ పెరుగుతోంది. అయితే పూతరేకులు ఒక చేతి నిండా పొడవుగా ఉంటేనే తినడానికి వీలుపడదు. ఇక అంతకంటే పెద్దగా ఉంటే ఎలా తింటారు. అయినా దాన్ని తినడానికి అంత పెద్దగా ఎందుకు తయారు చేశారు అనుకుంటున్నారా?. పూతరేకులకు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తేవాలని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవరు తయారుచేయని విధంగా అతిపొడవైన పూతరేకును ఆత్రేయపురానికి చెందిన నిపుణుల సాయంతో కష్టపడి తయారు చేశారు. 10 మీటర్ల పొడవుగల ఈ పూతరేకు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డారు. దీంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఆత్రేయపురం పూతరేకుకు చోటు దక్కింది. విజయవాడ బెరంపార్కులో తయారుచేసిన పూతరేకు నిర్వాహకులకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ ఘనత సాధించినందుకు ఆత్రేయపురం ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments