సీట్ల బేరంతో కూట‌మిలో కొత్త చిచ్చు

Saturday, November 10th, 2018, 10:49:43 AM IST

గులాబీ బాస్‌ను మ‌ట్టి క‌రిపించాల‌న్నదే ప్ర‌ధాన ఎజెండాగా కాంగ్రెస్‌తో క‌లిసి టీడీపీ, తెజ‌స‌, సీపీఐ కూట‌మి క‌ట్టిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా సీట్ల పంప‌కాల విష‌యంలో జ‌రుగుతున్న నాట‌కీయ‌ ప‌రిణామాలతో విసుగు చెందిన టీడీపీ, తెజ‌స‌, సీపీఐ పార్టీలు కాంగ్రెస్ వైఖ‌రిపై గుర్రుగా వున్నాయి. సీట్ల పంప‌కాల విష‌యంలో కాంగ్రెస్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. దీనికి మ‌రింత ఆజ్యం పోస్తూ సీపీఐ కూట‌మికి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతోంది. ఆరు సీట్లు కోరితే 3 సీట్లు మాత్ర‌మే కేటాయిస్తూ మ‌మ్మ‌ల్ని అవ‌మానిస్తున్నార‌ని సీపీఐ నేత చాడ వెంక‌ట‌రెడ్డి బాహాగంగానే కాంగ్రెస్‌పై విరుచుకుప‌డుతుండ‌టం ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఇదిలా వుంటే తుంగ‌తుర్తికి చెందిన కాంగ్రెస్ నేత జ్ఞాన‌సుంద‌ర్‌ సీట్ల పంప‌కాల విష‌యంలో భారీగా డ‌బ్బులు చేతులు మారాయ‌ని, కాంగ్రెస్ స్క్రీనింగ్ క‌మిటీ అధ్య‌క్షుడు భ‌క్త‌చ‌ర‌ణ్‌దాస్ కుమారుడు ఇబ్ర‌హీంప‌ట్నం టికెట్ ఇప్పించేందుకు ఏకంగా 3 కోట్లకు బేరం కుదుర్చ‌కున్నాడ‌ని చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్‌లో కొత్త చిచ్చును ర‌గిలిస్తోంది. ఈ తంతును రికార్డు చేసిన క్యామ మ‌ల్లేష్ అధిష్టానాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడ‌ని, ఆ వాయిస్ రికార్డు తాలూకు కాపీ త‌న ద‌గ్గ‌ర కూడా వుంద‌ని, స‌మ‌యం వ‌చ్చిప్పుడు దాన్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కూట‌మితోనూ సాగుతామ‌ని, ఎన్ని అవాంత‌రాలొచ్చినా కూట‌మిని వీడేది లేద‌ని తేల్చి చెప్పిన తెలంగాణ జ‌న‌స‌మితి నేత కోదండ‌రామ్ తాజా వైఖ‌రిలోనూ మార్పులు క‌నిపిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కుమ్ములాట‌లు, సీపీఐకి త‌గిన స్థానాలు కేటాయించ‌క పోవ‌డం వంటి ప‌రిణామాల మ‌ధ్య కోదండ‌రామ్ కూడా సీపీఐతో పాటు బ‌య‌టికి వ‌స్తారా? అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. వీటికి బ‌లాన్ని చేకూరుస్తూ సీట్ల పంపిణీ విష‌యంలో సీపీఐకి మ‌ద్ద‌తు తెల‌ప‌డం కాంగ్రెస్ వ‌ర్గాల‌ను ఇరుకున పెడుతోంద‌ట‌.