ఆపరేషన్ గరుడ, మహా కుట్ర ఒకటేనేమో : చంద్రబాబు

Sunday, June 3rd, 2018, 11:45:15 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న విజయవాడలో ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చని కారణంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షలో ఎంతో ఉద్వేగంతో ప్రసంగించారు. అమరావతి నిర్మాణానికి తొలుత మోడీ ఎన్నో హామీలు ఇచ్చి మన రాజధానిని సింగపూర్ స్థాయిలో నిలబెడతామన్నారు. అయితే అవి కేవలం కల్లబొల్లి మాటలేనని తేలిపోయిందన్నారు. ఓ వైపు రాష్ట్రప్రజలు చిరకాలం నిలిచిపోయే రాజధానికై ఎదురుచూస్తుంటే కేంద్రం మాత్రం మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా కేవలం వారు గెలుపొందిన రాష్ట్రాలపైనే శ్రద్ధ కేంద్రీకరిస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే రాజధానికి నిధులకోసం తాను ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లిన తనకు భంగపాటు తప్ప వారినుండి సరైన సమాధానం మాత్రం రాలేదన్నారు. టిడిపి ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతుందని, ఎన్టీఆర్ గారు స్థాపించిన నాటినుండి పార్టీలో నేతలు, కార్యకర్తలు కేవలం ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు.

ఇటీవల నటుడు శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్ గరుడ వంటి మహా కుట్ర తనమీద, రాష్ట్ర టీడీపీ మీద తీవ్ర స్థాయిలో జరుగుతోందని అన్నారు. ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో మద్దతిచ్చినట్లే ఇచ్చి ప్రస్తుతం బిజెపి అడుగుజాడల్లో టీపీడీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని, అప్పట్లో ఎంతో మంచిగా కనిపించిన మేము ఒక్కసారిగా చేదు ఎందుకు అయ్యామో అర్ధం కావడం లేదని అన్నారు. బిజెపితో రహస్య ఒప్పందం పెట్టుకున్న వైసిపి అధినేత జగన్ చెప్పే మాటల్లో మొత్తం అబద్ధాలని, రాష్త్ర అభివృద్ధి జరగడం చూస్తూ కూడా జగన్ సహా వైసిపి నేతలు ఓర్వలేక తమపైనే లేనిపోని నిందారోపణలు వేస్తున్నారని అన్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రజలు మొత్తం గమనిస్తున్నారని, వారిని మోసం చేయడం ఎవరివల్ల కాదని అన్నారు. ఎవరితో మున్ముందు పొత్తు పెట్టుకుంటాం అనేది ఇప్పుడే చెప్పలేమని, రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీతో తప్పక విజయం సాధించి మల్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసారు….