ఆధార్ వ్యవహరంపై కోర్టును ఆశ్రయించిన సీఎం

Friday, October 27th, 2017, 02:00:51 PM IST

ప్రస్తుతం ఆధార్ అన్నిటికి అవసరం అనే విషయం పై వివాదాలు చాలానే రేగుతున్నాయి. వీలు చిక్కినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయూలో మండిపడుతున్నాయి. ప్రతి విషయంలో ఆధార్ అవసరం అంటే సామాన్యుడికి చాలా కష్టమవుతోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆధార్ తో మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ తప్పనిసరని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలను జారీ చేస్తోంది.

అయితే ఇటీవల ఈ విషయంపై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఫైర్ అవుతున్నారు. ఆమె అవకాశం దొరికినప్పుడల్లా మోడీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే తరహాలో ఆధార్ కార్డుతో మొబైల్ లింక్ అనుసంధానం చేయాలనీ వస్తున్న వార్తలను ఆమె ఖండిస్తున్నారు. తాను ఏ మాత్రం మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయ‌న‌ని, తేల్చి చెబుతున్నారు. అంతే కాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండ‌ని కూడా ఆమె అనడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ రోజు ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించి అన్నిటికి ఆధార్ తప్పనిసరి అనే విషయంపై అభ్యంత‌రాలు తెలుపుతూ పిటిష‌న్ వేశారు. అయితే కోర్టు ఈ పిటిష‌న్‌ పై ఈ నెల 30న విచార‌ణ జ‌ర‌ప‌నుందని సమాచారం.