ప్రధాని మోడీ దేశంలో సూపర్ ఎమర్జెన్సీని సృష్టించారంటున్న మమత

Tuesday, December 27th, 2016, 09:35:37 PM IST

mamatha
ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు. మరికొంతమంది విమర్శిస్తున్నారు. మోడీ మాత్రం అవేం పట్టించుకోకుండా ఆయన చేయాలనుకున్న పనులన్నీ చాలా స్పీడ్ గా చేసుకుంటూ పోతున్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత మోడీ మాట్లాడుతూ తనకు 50 రోజులు సమయం ఇవ్వమని ఆ తరువాత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని మాట ఇచ్చారు. అయితే ఆయన అడిగిన 50 రోజుల సమయం ఈ నెల 30 తో పూర్తి అయిపోతుంది. కానీ ఇప్పటివరకు ప్రజలకు కష్టాలు తీరలేదు. మరి మిగిలిన ఈ మూడు రోజుల్లో ఆయన ఏమైనా అద్భుతం చేస్తారా వేచి చూడాల్సిందే

ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో సూపర్ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని, దేశం ఎన్నడూ లేని విధంగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని ఆమె విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో ప్రతిపక్షాలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రానంతరం జరిగిన అతి పెద్ద కుంభకోణం ఈ నోట్ల రద్దు అని ఆమె తీవ్రంగా విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి ఎజెండాతో ముందుకు వెళ్లాలని ఆమె కోరారు. ప్రజలకు ఆయన ఇచ్చిన 50 రోజుల గడువు లోగా ప్రజల కష్టాలు తీర్చకపోతే మోడీ రాజీనామా చేస్తారా అని మమతా బెనర్జీ నిలదీశారు.

  •  
  •  
  •  
  •  

Comments