మన్మోహన్ సింగ్ ఆవేదన: కోర్టుకు వెల్దామన్నా డబ్బుల్లేవు..!

Thursday, January 10th, 2019, 12:00:02 PM IST

మన్మోహన్ సింగ్ దగ్గర డబ్బుల్లేకపోవటం ఏంటని షాక్ అవుతున్నారా? నిజమే, ఆయన దగ్గర డబ్బులేవని ఆయనే స్వయంగా వెల్లడించారు, గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఐఎంఎఫ్ సలహాదారుడిగా, అందులోను ప్రధానిగా పదేళ్లు దేశానికి సేవలందించిన ఆయన దగ్గర డబ్బులేవంటే ఎవరూ నమ్మరు. కానీ, ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తనతో అన్నారని మన్మోహన్ సింగ్ మిత్రుడైన మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ అన్నారు. అసలు విషయానికి వస్తే, మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే, ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాలు మన్మోహన్ ను కించపరిచేట్లు ఉండటంతో నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ విషయంపై పెద్ద వివాదమే నెలకొంది, దీంతో మన్మోహన్ సింగ్ ను కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వెయ్యాలని కొంతమంది సలహా ఇచ్చారట. ఇదే విషయాన్నీ శివాజీ దగ్గర ప్రస్తావిస్తూ, మన్మోహన్ సింగ్ కోర్టులో పోరాడేందుకు తన వద్ద డబ్బుల్లేవని, లాయర్లకు భారీగా ఫీజులు చెల్లించలేనని అన్నారట. ఏది ఏమైనా దేశానికి ప్రధానిగా పదేళ్ల పాటు సేవలందించిన పెద్దమనిషి దగ్గర కోర్టులో న్యాయపోరాటం చేయటానికి కూడా డబ్బుల్లేవంటే, ఇది ఆయన నిజాయితీకి నిదర్శనం అనుకోవాలా? న్యాయ వ్యవస్థకు సామాన్యుడికి మధ్య అంతరం పెరుగుతోందని అనుకోవాలా?.