ఇలా దిగాజారిపోయావ్ ఏంటి మోదీ నీకో దండం :మన్మోహన్

Monday, May 7th, 2018, 07:31:40 PM IST


సౌమ్యుడనే పేరున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఊహించని రీతిలో ఎదురుదాడికి దిగారు. ప్రధాని నరేంద్ర మోడీపై తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ ఇష్టం వచ్చినట్లు దేశాన్ని నడుపుతున్నదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ విజయాలను మోడీ ప్రభుత్వం పూర్తిగా తిరోగమనంలోకి తీసుకెళ్లిందని ఆరోపించారు.మోడీ సర్కార్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని పూర్తి నష్టాల్లోకి నెట్టాయని విమర్శించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోయినా కూడా యూపీఏ ప్రభుత్వం నిలకడగా 7.8 శాతం వృద్ధిరేటు సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. ఎన్డీయే ప్రభుత్వం అంతకన్నా తక్కువ వృద్ధిరేటును సాధిస్తున్నది అని మన్మోహన్ అన్నారు. నోట్లరద్దు – జీఎస్టీలాంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశంలో లక్షల ఉద్యోగాలు పోయాయని ఆయన విమర్శించారు.

దీంతో పాటుగా మోడీపై వ్యక్తిగతంగా కూడా దాడి చేశారు.`దేశంలో ఇప్పటివరకు ఏ ప్రధాని కూడా తన ప్రత్యర్థులపై ఇంత దారుణ వ్యాఖ్యలు చేయలేదు. ఓ ప్రధాని ఇంతలా దిగజారడం ఆయనకే కాదు దేశానికి కూడా మంచిది కాదు` అని మన్మోహన్ స్పష్టం చేశారు. `నిజమైన నాయకత్వం అవకాశాలు కల్పిస్తుంది కానీ వాటిని నాశనం చేయదు. కానీ మోదీ సర్కార్ పథకాలన్నీ అలాగే ఉన్నాయి` అని మన్మోహన్ అన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నా దేశంలో పెట్రోల్ – డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని – మోడీ సర్కార్ తీసుకున్న ఎక్సైజ్ డ్యూటీ పెంపు నిర్ణయమే దీనికి కారణమని ఆయన విమర్శించారు. మోడీ సర్కార్ ప్రజలను శిక్షిస్తున్నదని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రూడాయిల్ ధరలు 67 శాతం తగ్గినా పెట్రోల్ – డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడమేంటని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ అమలుపరుస్తున్న విధానాల వల్ల బ్యాంకులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం పాల్గొనేందుకు వచ్చిన మన్మోహన్ సింగ్ ఇవాళ బెంగుళూరులో మీడియాతో మాట్లాడారు. మోడీ విధానాల వల్ల దేశం ఎన్నడూ లేనివిధంగా చాలా క్లిష్టమైన పరిస్తితిని ఎదుర్కొంటోందన్నారు. ఈ పరిస్థితి నివారించదగ్గదైనా… ప్రభుత్వం వద్ద ఆలోచనాపరులు లేరని ఆయన విమర్శించారు. వృద్ధి రేటు ఎన్డీఏ హయాంలో బాగా క్షీణించిందన్నారు. ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని – ప్రైవేట్ కంపెనీలు పనిచేయడం లేదన్నారు. నేరాలు నాలుగింతలు పెరిగాయన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోయిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు సాకారం అవుతున్నాయని మన్మోహన్ అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments