ఆరో స్వర్ణం తో అదరగొట్టిన మేరీకోమ్

Saturday, November 24th, 2018, 05:00:02 PM IST

మేరీకోమ్… ఈ పేరు వెనక చాలా పెద్ద కథ ఉంది. ఈ పేరు వినని వారు ఎవరు లేరు కూడా. తాను ఒక బాక్సింగ్ క్రీడాకారిణి, భారత బాక్సింగ్ దిగ్గజం. మేరీకోమ్ మరోసారి చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో 48కిలోల విభాగంలో ఉక్రేయిన్‌ బాక్సర్‌ హన్నా ఓఖోటాతో తలపడింది. ఈ పోరులో 5-0తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.ఈ స్వర్ణ పథకం తో మేరీకోమ్ మొత్తం 6 స్వర్ణ పథకాలు గెలుచుకుంది. మేరికోమ్ చివరి సారిగా 2010 లో 48 కిలోల విభాగంలో ప్రపంచ బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచింది. ఈ పోటీకి ముందు ఆమె ఐర్లాండ్‌ బాక్సర్‌ కేటీ టేలర్‌ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో పతకాల పరంగా సమంగా ఉంది. అయితే తాజాగా విజయంతో మహిళల బాక్సింగ్‌ చరిత్రలోనే అత్యధికంగా ఆరు స్వర్ణాలు(2002,05,06,08,10,18) గెలుచుకున్న క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

తన కుటుంబ బాధ్యతలతో కొన్నాళ్లు బాక్సింగ్‌కు దూరంగా ఉంటున్నటువంటి మేరీకోమ్ 2018 గోల్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. అంతకు ముందు రియో ఒలింపిక్స్‌ కోసం పోటీపడ్డా అర్హత పోటీల్లో ఓడిపోవడంతో తాను ఇంకా పోటీ చేయలేదేమోనని అందరు విమర్శించారు. కానీ మేరీకోమ్ పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆమె తిరిగి కఠోర సాధన చేసి తన పాత బలాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె వయసు 35 ఏళ్లు. ముగ్గురు పిల్లలు. రాజ్యసభ సభ్యురాలు. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ బాక్సింగ్‌లో దూసుకుపోతుండటం మరో విశేషం. మేరీకోమ్ మన దేశానికి గర్వకారణం.