వాట్సాప్ దెబ్బ.. ఆగిపోయిన పెళ్లి!

Sunday, September 9th, 2018, 02:55:58 PM IST

సోషల్ మీడియా అనేది ఇప్పుడు మనిషిలో ఒక భాగంగా మారిపోయిందని చెప్పాలి. వాటి వల్ల ఉపయోగాల కంటే ఎక్కువ అనర్ధాలే జరుగుతున్నాయి. ఇక వాట్సాప్ కూడా మనుషుల్లో చాలా ప్రభావం చూపెడుతోంది. అసలు విషయంలోకి వస్తే ఇటీవల వాట్సప్ కారణంగా పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోయింది. అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. సాధారణంగా పెళ్లికి సంబందించిన వివాదాలు చెలరేగాయి అంటే ఎక్కువగా కట్నం వివాదమే అయ్యి ఉంటుందని అంతా అనుకుంటారు.

కానీ యూపీ ఘటనలో మాత్రం వాట్సాఫ్ కారణమైంది. స్థానికంగా అమ్రోహా జిల్లాకు చెందిన యువతికి లక్నో యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. శనివారం బంధువులందరూ పెళ్లి కోసం ముస్తాబై వచ్చారు. పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు బంధువుల కోసం ఎదురుచూడసాగారు. అయితే కాస్త ఆలస్యంగా వచ్చిన వారు పెళ్లి ఇష్టం లేనట్టు చెప్పేశారు. వధువు ఎక్కువగా వాట్సాప్ లోనే ఉంటుందని 24 గంటలు ఆన్లైన్ లోనే ఉండడం తమకు నచ్చలేదని చెప్పారు. వాట్సాప్ కి బానిసైన కోడలు తమకు ఎంత మాత్రం వద్దని వరుడు తండ్రి గట్టిగా చెప్పేశాడు. దీంతో పెళ్లి కాస్త ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. 64 లక్షల రూపాయల వరకు కట్నం ఇవ్వకపోవడం వల్లే పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఈ విధంగా పెళ్లి ఆపేసి నిందలు వేస్తున్నారని కేసు నమోదు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments