బంతి వేయనీయకుండా చేసి హైదరాబాద్ పరువు అడ్డంగా తీశారు..!

Saturday, October 14th, 2017, 10:04:48 AM IST

తెలుగు వారంతా మనకూ ఓ గ్లోబల్ సిటీ ఉందని మురిసిపోయే నగరం హైదరాబాద్. కానీ హైదరాబాద్ లోని కొని అంశాలని పరిగణలోకి తీసుకుంటే గ్లోబల్ సిటీ అన్న పేరుకు తగ్గట్లుగా ఉందా అనే అనుమానాలు కలగానే మానవు. వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటో అందరికి తెలిసిన సంగతే. సరే అది ప్రభుత్వ పరమైన వ్యవహారం. నగర కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటాలంటే సాంకేతిక పరిజ్ఞానం, కళలు, క్రీడలు అన్నింటిలో మనవైన ముద్రని చాటుకోవాలి. అలా చాటుకోవడానికి చాలా అరుదుగా అవకాశం వస్తుంది. వచ్చిన అవకాశాన్ని చేజేతులా నాశనం చేసిన హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్ సి ఏ) ఇంటా బయటా విమర్శల పాలైంది. హెచ్ సి ఏ పాలకులు అవినీతికే కానీ సమర్థత విషయంలో పనికి రారని మరో మారు రుజువైంది.

భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ హైదరాబాద్ లో అంతర్జాతీయ మ్యాచ్ లకు చాలా అరుదుగా అవకాశం ఇస్తూ ఉంటుంది. హైదరాబాద్ లో మ్యాచ్ జరిగిన ప్రతి సారి అభిమానులు స్టేడియం వైపు ఎగబడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా శుక్రవారం ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య ఉప్పల్ స్టేడియంలో సిరీస్ నిర్ణయాత్మక టి 20 మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ అవుట్ ఫీల్డ్ సరిగా లేకపోవడంతో మ్యాచ్ రద్దయింది. శుక్రవారం రోజు చినుకు వర్షం కూడా పడలేదు. కేవలం హెచ్ సి ఏ పాలకుల నిర్లక్ష్యం వలన స్టేడియంకు వచ్చిన వేలాది మంది అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.

హైదరాబాద్ లో గత నెలరోజులుగా వర్షం పడుతోనే ఉంది. బీసీసీఐ కూడా నెలరోజుల ముందే హైదరాబద్ లో మూడవ టి 20 అని ప్రకటించింది. కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని నిర్వాహకులు మ్యాచ్ ని నీరుగార్చారు. వర్షం పడితే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ శుక్రవారం వర్షం పడలేదు. అంతకు ముందు కురిసిన వర్షాలకు ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. దానిని సిద్ధం చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. బీసీసీఐ నుంచి కోట్లాది రూపాయలు నిధులు వస్తున్నా అవినీతికే సరిపెడుతున్నారు కానీ మ్యాచ్ లకు మైదానాన్ని సిద్ధం చేయడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం లేదు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఇంకా 2003 నాటి పద్ధతులనే ఫాలో అవుతోంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

భారత్, ఆసీస్ లమధ్య రెండవ వన్డే మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. ఈ మ్యాచ్ ముందు రోజు వరకు అక్కడ కుండపోత వర్షం. మాజీ కెప్టెన్ గంగూలీ సారధ్యం లోని బెంగాల్ క్రికెట్ సంఘం మ్యాచ్ రోజు మధ్యాహ్నానికి స్టేడియంని సిద్ధం చేశారు. గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడయ్యాక వారు అత్యాధునిక పద్ధతులని అవలంభిస్తున్నారు. కానీ ఉప్పల్ లో 2003 చేసిన అవుట్ ఫీల్డ్ కు ఇంతవరకు ఎలాంటి మార్పులు చేయలేదు. 60 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం తో ఉప్పల్ కు దేశం లోని స్టేడియాలలో మంచి పేరే ఉంది. హెచ్ సీఏ నిర్వాహకులు వారి నిర్లక్ష్యంతో ఆ పేరుని చెడగొడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments