కేసులు.. ప‌ద‌వులు.. `మాయా`వ‌తి రాజ‌కీయం!?

Friday, October 5th, 2018, 01:26:58 AM IST


అవినీతి రాజ‌కీయాలు ప‌రాకాష్ట‌కు చేరుకున్న‌ సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ పార్టీల అండ‌తో అవినీతిని య‌థేచ్ఛ‌గా సాగించ‌వ‌చ్చు. త‌మ‌పై ఏవైనా కేసులు ఉన్నా త‌ప్పించుకోవ‌చ్చు. అంతేకాదు.. ఆదాయ‌ప‌న్ను శాఖ‌- ఈడీ నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌భుత్వాధికారం చేతిలో ఉండి తీరాలి. స‌రిగ్గా ఇదే కార‌ణం బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి కాంగ్రెస్‌కి జెల్ల తినిపించి భాజ‌పా కూట‌మితో జ‌ట్టు క‌డుతోందంటూ ప్ర‌చారం సాగుతోంది.

పార్టీలు మార‌డంలో తొలి నుంచి త‌న‌కంటూ ఓ రికార్డు ఉన్న మాయావ‌తి మ‌రోసారి త‌న‌దైన శైలిలో త‌న‌ను న‌మ్ముకున్న కాంగ్రెస్‌ను న‌ట్టేట ముంచేందుకు రెడీ అవుతున్నారన్న వాద‌న వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018 ముగింపులో జ‌ర‌గ‌నున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్, చ‌త్తీస్‌ఘ‌డ్ ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా భాజ‌పా పావులు క‌దుపుతోంది. ఆ మూడు చోట్లా నెగ్గ‌డం అన్న‌ది భాజ‌పాకి చారిత్ర‌క అవ‌స‌రం. అందుకే ఇప్పుడు మాయావ‌తికి స్కెచ్ గీసింద‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఇక బ‌హుజ‌న స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావ‌తి భాజ‌పాకి స్నేహ‌హ‌స్తం అందించాల‌నుకోవ‌డానికి కార‌ణం త‌న‌పై ఉన్న కేసులే. ఐటీ-ఈడీ దాడులు, కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో భాజ‌పాతో చెలిమి చేయ‌క త‌ప్పేట్టు లేద‌ని విశ్లేషిస్తున్నారు. ఆ మేర‌కు మాయావ‌తిని హెచ్చ‌రించి త‌మ పార్టీలోకి లాక్కునే ఎత్తుగ‌డ‌ను భాజ‌పా అనుస‌రించి ఉంటుంద‌ని అంటున్నారు. అలానే త‌మ పార్టీ కూట‌మిలో చేరితే ఉప ప్ర‌ధాని ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తామ‌ని భాజ‌పా పెద్ద‌లు గాలం వేసి ఉంటార‌న్న మాటా వినిపిస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్ కూట‌మికి హ్యాండిచ్చి భాజ‌పా- కూట‌మిలోకి చేరితే అదో పెనుసంచ‌ల‌న‌మే కానుంది. అయితే కాంగ్రెస్‌కి స్నేహ‌హ‌స్తం అందించిన‌ట్టే అందించి మాయావ‌తి ఇలా చేస్తుంద‌ని మాత్రం ఆ పార్టీ ఊహించ‌లేదు. అదే ఇక్క‌డ షాకింగ్ ట్విస్ట్‌.