మీటూ : స్టార్ లిరిసిస్ట్‌పై చిన్మ‌యి పిడుగు

Wednesday, October 10th, 2018, 01:42:14 PM IST

చిన్మ‌యి శ్రీ‌పాద‌.. ప‌రిచ‌యం అఖ్క‌ర్లేని పేరు ఇది. డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా, గాయ‌నిగా సౌత్ ఇండ‌స్ట్రీస్‌కి సుప‌రిచితం. అంత‌కుమించి స‌మంత‌కు క్లోజ్ ఫ్రెండ్ అన్న సంగ‌తి ప‌రిశ్ర‌మ‌కు తెలుసు. అయితే గ‌త కొంత‌కాలంగా చిన్మ‌యి సామాజిక మాధ్య‌మాల్లో ఎంతో యాక్లివ్‌గా ఉంటూ అభిమానులకు ట‌చ్‌లో ఉన్నారు. హీరో కం హ‌బ్బీ రాహుల్ ర‌వీంద్ర‌న్‌ని ద‌ర్శ‌కుడిగానూ ప్ర‌మోట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. అయితే కెరీర్ ప‌ర‌మైన పాకులాట ఒకెత్తు అనుకుంటే.. ఉన్న‌ట్టుండి చిన్మ‌యి త‌న‌పై జ‌రిగిన లైంగిక దాడుల గురించి ప్ర‌స్థావిస్తూ సంచ‌ల‌నాల‌కు తావిస్తున్నారు. టీనేజీ వ‌య‌సులోనే మృగాళ్ల కామ‌వాంఛ‌లకు తాను ఇబ్బందుల‌కు గురి కావాల్సి వ‌చ్చింద‌ని ఇదివ‌ర‌కూ వ్యాఖ్యానించడం సంచ‌ల‌న‌మైంది.

తాజాగా ఇండ‌స్ట్రీ బిగ్ షాట్ పేరు చెప్పి మ‌రోసారి పెను ప్ర‌కంప‌నాల‌కు కార‌ణ‌మ‌య్యారు చిన్మ‌యి. కోలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ వైర‌ముత్తు త‌న‌పైనా, కొంద‌రు సింగ‌ర్ల పైనా వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. వైర‌ముత్తు అంటే ఎంతో సీనియ‌ర్ లిరిసిస్ట్‌. వేటూరి సుంద‌రరామ మూర్తి కి స‌మ‌కాలికుడు. త‌మిళ ప‌రిశ్ర‌మ‌ను ద‌శాబ్ధాల పాటు ఏలిన‌ గ్రేట్ ట్యాలెంట్ ఆయ‌న‌. ఇక్క‌డ వేటూరి ఎంత‌టి దిగ్గ‌జ‌మో.. అక్క‌డ వైర‌ముత్తు అంతే పెద్ద దిగ్గ‌జం. అలాంటి స్టార్ లిరిస్ట్ ఈ త‌ర‌హా వివాదంలోకి రావ‌డంతో కోలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కి గురైంది.
మీటూ ఉద్య‌మంలో నేను సైతం అంటూ బ‌రిలో దిగిన చిన్మ‌యి వైర‌ముత్తుపై సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. “వైరముత్తు స‌ర్‌.. మీరేం చేశారో మీకు తెలుసు. మీ టైమ్ అయిపోయిందిక‌!“ అంటూ కామెంట్‌ని పోస్ట్ చేశారు. ఐ డోంట్ కేర్.. మునుముందు పాడ‌తానో లేదో, డ‌బ్బింగ్ చెబుతానో లేదో నాకు తెలీనే తెలీదు. ఇది నా క‌థ‌. ఇది నిజం“ అంటూ చిన్మ‌యి పోస్ట్ చేశారు. ఈ ఆరోప‌ణ‌ల అనంత‌రం త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ప‌రిణామాలు ఎలా మార‌బోతున్నాయో అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది.