టిఆర్ఎస్ లో టి టిడిపి ని విలీనం చేయండి మోత్కుపల్లి నర్సింహులు

Thursday, January 18th, 2018, 10:37:29 AM IST

తెలంగాణ లో టిడిపి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఈ పరిస్థితి కొంతవరకు తొలగిపోవాలంటే చంద్రబాబు తగు నిర్ణయం తీసుకుని ఇక్కడ ఒక సారి పర్యటన చేస్తే అటు క్యాడర్ లోను, ఇటు నాయకులలోను ఆత్మస్థైర్యం వస్తుందని టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. యన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని నేడు యన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించడానికి ఇక్కడకు రాకపోవడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. ఆయన వస్తే బాగుండేదని, ఇటువంటి పరిస్థితులు ఇక్కడ పార్టీ ని నిర్వీర్యం చేసేందుకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. తెలంగాణ లో టిడిపి పని అయిపోయిందని ప్రజల్లో ఒక భావన మొదలైయిందని, దానికంటే పార్టీని టీఆరఎస్ లో విలీనం చేయడమే కొంతవరకు మంచిదని, తాను రాజకీయ దురుద్దేశంతో ఈ మాటలు చెప్పడంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా విలీనం చేయడం వల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఇదివరకు జరిగిన 2014 ఎన్నికల్లో టిడిపి కి 22 శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఓట్లు వేసిన ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలంటే విలీనమే సరైన పద్ధతి అని ఆయన అన్నారు. టీఆరెస్ పార్టీ లో ఇప్పుడున్న చాలామంది ప్రముఖ నాయకులు అందరూ ఒకప్పుడు టిడిపి పార్టీ తరపున చంద్రబాబు నాయకత్వం లో పనిచేసిన వారే అని ఆయన గుర్తుచేసారు. తెలంగాణ లో పార్టీని బలోపేతం చేసేందుకు నేతలు ఎవరు సహకరించడం లేదని, పార్టీని బ్రతికించుకోవడానికి నేతలు ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా సీనియర్లు మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి చంద్రబాబు ఇకనైనా మేల్కొని పార్టీ ప్రతిష్ఠను పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తే భవిష్యత్తు బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు…

  •  
  •  
  •  
  •  

Comments