మైకేల్ జాక్సన్ కూతురు ఆత్మహత్యాయత్నం

Thursday, June 6th, 2013, 10:48:43 AM IST

దివంగత సంచలన పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ కూతురు 15 ఏళ్ల పారిస్ ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు సేవించడంతో అపస్మారక స్థతిలో ఉన్న ఆమెను లాస్ ఏంజెలెస్ లోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. పారిస్ మందులను మోతాదుకు మించి తీసుకుందని ఒకరు చెప్పగా, మణికట్టుపై కోసుకున్న గాయాలు ఉన్నాయని సహాయక బృంద సభ్యుడు తెలిపారని, టీఎంజీ వెబ్‌సైట్ వెల్లడించింది.

అయితే, పారిస్ ఆత్మహత్యాయత్నానికి ముందు ఫ్రెండ్స్‌కు ట్వీట్ చేసింది. ”కన్నీళ్లు ఎందుకు ఉప్పగా ఉంటాయి? కష్టాలు దూరంగా ఉన్నాయని అనుకున్నా కానీ, ఇప్పుడవి ఇక్కడే తిష్ట వేసుకు కూర్చున్నాయి” అని ట్విట్టర్‌లో పెట్టింది. ఆత్మహత్యయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

పారిస్ తండ్రి మైకెల్ జాక్సన్ 50 ఏళ్ల వయసులో (2009లో) మరణించాడు. తండ్రిపై అమితమైన ప్రేమ కారణంగా పారిస్ డిప్రెషన్‌కు గురైందని, గతంలో కూడా డిప్రెషన్‌కు ట్రీట్ మెంట్ తీసుకుందనే వార్తలు వస్తున్నాయి.