కాంగ్రెస్‌తో బాబు పొత్తు తేరాస‌కే లాభం!-హ‌రీష్‌రావు

Monday, September 17th, 2018, 06:00:05 PM IST

ఒక అబ‌ద్ధాన్ని ప‌దే ప‌దే చెప్పి గోబెల్స్ ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్ని త‌ప్పు దారి ప‌ట్టించ‌డ‌మే కాంగ్రెస్సోళ్ల ప‌ని. ప్ర‌తిప‌క్షాల గోబెల్స్ ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని అన్నారు మంత్రి హ‌రీష్‌రావు. కేసీఆర్‌కి రాష్ట్రంపై ఉన్న అవ‌గాహ‌న ఈ రాష్ట్రంలో వేరొక‌రికి లేనేలేదు. 70 ఏళ్ల‌లో చేయ‌నిది కేవ‌లం నాలుగేళ్ల‌లో చేశారు కేసీఆర్‌. అందుకే ప్ర‌జ‌లు మ‌రోసారి ఆయ‌న్నే సీఎంగా కోరుకుంటున్నారు.. అని అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పినా చెప్ప‌క‌పోయినా ప్ర‌జ‌ల‌కు ఏం అవ‌స‌ర‌మో అన్నిటినీ ఆయ‌న అందిస్తున్నారు. కీల‌క‌మైన సాగు-తాగు నీటిని అందించేందుకు ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నార‌ని అన్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌లు ఎందుకు? అని అన్ని పార్టీల నాయ‌కులు భ‌య‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు, ప్ర‌తిప‌క్షాలు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? భ‌య‌ప‌డ‌డంతోనే ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోతోంది. సీఎంపైనా, తేరాస‌పైనా గోబెల్స్ ప్ర‌చారం చేస్తున్నారని అంద‌రికీ అర్థ‌మైంది. ప్ర‌జ‌ల‌కు కావాల్సింది టీఆర్ఎస్ అధికారంలోకి రావ‌డం ఒక్క‌టే. కేసీఆర్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని కోరుకుంటున్నారని హ‌రీష్ టీవీ9 ముర‌ళీకృష్ణ ఇంట‌ర్వ్యూలో ఉద్ఘాటించారు. కేసీఆర్ మా బాస్. ఆయ‌నేం చెబితే అది చేయ‌డ‌మే మా ప‌ని అనీ తెలిపారు. గెలిచే పార్టీలోనే టిక్కెట్ల‌కు గొడ‌వ‌.. ఉంటుంది. గెల‌వని పార్టీల్లో టిక్కెట్లు ఇస్తామ‌న్నా ఎవ‌రూ ముందుకు రార‌ని అన్నారు.

ప్ర‌తిప‌క్షాలు ఏకం కావ‌డం వ‌ల్ల టీఆర్ఎస్ మ‌రింత పెద్ద మెజారిటీతో గెల‌వ‌బోతోందని ఆయ‌న‌ అన్నారు. తేదేపా-కాంగ్రెస్ క‌ల‌యిక అనైతిక‌మ‌ని, చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తారా? కాళేశ్వ‌రం, పాల‌మూరు స‌హా అన్ని ప్రాజెక్టుల్ని చంద్ర‌బాబు వ‌ద్ద‌న్నారు. అవ‌న్నీ అక్ర‌మం అని వ్య‌తిరేకించారు. ప్రాజెక్టుల విష‌యంలో బాబు వ్య‌తిరేకంగా ఉంటాడు. ఒక‌వేళ ఏపీ, తెలంగాణ‌లో ఏ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఆశిస్తారు? అని ప్ర‌శ్నిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాలు అనే చెప్ప‌గ‌లం. అలాంటివాడితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవ‌డం అంటే ఎవ‌రికి మేలు చేస్తున్న‌ట్టు వీళ్లంతా? అందుకే తేరాస ఈ ఎన్నిక‌ల్లో పెద్ద మెజారిటీతో గెల‌వ‌బోతోంద‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షాల గోబెల్స్ ప్ర‌చారాన్ని ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని తీవ్ర స్వ‌రం వినిపించారు.