కాంగ్రెస్ కు కన్నీళ్లు తప్పవు: మంత్రి హరీష్ రావు

Friday, April 6th, 2018, 09:16:14 AM IST

రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకోకుండా బస్సు యాత్ర అంతో కొత్త కొత్త యాత్రలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులకు చివరకు కన్నీళ్లే మిగులుతాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. తాము కేవలం కొన్ని నెలల సమయంలోనే కాల్వల పనులు చేపట్టి నదుల నీటిని పారిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలోని 29వ ప్యాకేజీ కాల్వ పనులను, కల్వకుర్తి ప్రాంతంలోని 160వ కిలోమీటర్, బిజినేపల్లి వరకు ఎంజీకేఎల్‌ఐ కాల్వ వెంట వెళ్లి పనులను పరిశీలించారు. అదే దారిలో పలువురు పంట పొలాలను పరిశీలించి రైతులతో వాళ్ళు ప్రభుత్వం నుండి పొందుతున్న సహాయాలు మరియు వాళ్ళ కష్టాల గురించి మాట్లాడారు. అనంతరం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగమాయిపల్లి ఈర్లచెరువుకు పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ ద్వారా వెళ్తున్న ఎంజీకేఎల్‌ఐ నీటికి మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పూజలు చేశారు. పెద్దమందడి మండలం ఈర్లచెరువు సమీపంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసమే తహతహలాడుతున్నదన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం కరెంట్, సాగు, తాగునీరు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు పర్చుతున్నదన్నారు. దీంతో ఏ సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు బస్సు యాత్ర చేపట్టి మరింత గందరగోళంలో పడిపోయారన్నారు. 45 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేని పనులను కేవలం 45 రోజుల్లోనే కాల్వ పనులను పూర్తిచేసి నదుల నీటిని అందిస్తున్నామన్నారు. ఎలాంటి అభివృద్ధి, ఆశయం లేకుండా అధికార దాహంతో చేపట్టిన కాంగ్రెస్ బస్సుయాత్ర వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ పనులను కేవలం 45 రోజుల్లో పూర్తి చేశామని, కాంగ్రెస్ పార్టీ అయితే మరో పదేండ్ల వరకు కొనసాగించేదని మంత్రి ఉదహరించారు. పెండింగ్ ప్రాజెక్టులతోపాటు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టు పనులన్నింటిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. ఉమ్మడి పాలమూరులోని నాలుగు పెండింగ్ ప్రాజెక్టులతోపాటు నూతనంగా చేపట్టిన తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులను శరవేగంగా చేపడుతున్నామని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments