కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్ళు :మంత్రి కేటీఆర్

Tuesday, April 3rd, 2018, 06:42:22 PM IST

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని, వాళ్ళు మోసగాళ్ళు అని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రజల నిండు జీవితాలను పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. మణుగూరులో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని అని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మూసివేయాలని మహాత్మాగాంధీ చెప్పారని అన్నారు. ఆనాడు తెలంగాణ, ఆంధ్రాకు నెహ్రూ బలవంతపు పెళ్లి చేశారని ఎద్దేవా దేశారు. ముల్కీ రూల్స్ విషయంలో ఇందిరాగాంధీ తెలంగాణకు అన్యాయం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలంతా తిరగబడితే తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే చీకటి అయితదని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నాడు.

దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇంటింటికి తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. పూర్వ ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతమని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీలు సీతారాంనాయక్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాలు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments