పవన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ మండిపాటు!

Tuesday, March 20th, 2018, 04:39:04 PM IST

ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వ పాలన పై అలానే చంద్రబాబు తనయుడు, ఐటి మంత్రి నారా లోకేష్ పై చేసిన ఆరోపణలు కొంత దుమారాన్ని రేపాయి. దానిపై టీడీపీ నేతలు స్పందిస్తూ, పవన్ బిజెపి డైరెక్షన్ లో పని చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అలానే ముఖ్య మంత్రి చంద్ర బాబు కూడా ఇన్నాళ్లు లేనిది, పవన్ ఇప్పుడు తమ పై తప్పుగా వ్యాఖ్యలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అయితే నేడు ఆ విషయం పై మంత్రి నారా లోకేష్ స్పందించారు.

టిడిపిపై, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై, తనపై నిరాధర ఆరోపణలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన స్థాయిని తగ్గించుకొన్నారని లోకేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే నాలుగేళ్ళుగా పవన్ కళ్యాణ్ ఎందుకు తమ దృష్టికి తీసుకురాలేదని, ఎందుకు రాత్రికి రాత్రే పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకొన్నారని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోస్తే ఆ దుమ్మును తాను దులుపుకోవాలా అంటూ లోకేష్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని ఆయన అన్నారు. టిటిడి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో తనకు సంబంధాలను అంటగట్టారని, శేఖర్‌రెడ్డితో సంబంధాలపై ఆరోపణలు చేసిన తర్వాత ఆధారాలుంటే రుజువు చేయాలని డిమాండ్ చేయడంతో పవన్ కళ్యాణ్ మాట మార్చారని లోకేష్ చెప్పారు.

ఆయన వ్యాఖ్యల వెనుక మర్మమేమిటో తెలియదని అన్నారు. పవన్ ఏపీ ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావును చూసి శేఖర్‌రెడ్డిగా భ్రమ పడ్డారని, ఓ ఫోటోలో తనతో పెద్దిరామారావు ఉన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి హైదరాబాద్‌లో కూర్చున్న వారికి ఏం తెలుస్తుందని పవన్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాను 8 ఏళ్లుగా తన ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్నానని, అంతకు మించి ఎక్కువ ఆస్తులుంటే వారే తీసుకోవచ్చని లోకేశ్‌ సవాల్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా అమరావతిలో ఉండి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతుంటే విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. చంద్రబాబుకు రెండున్నర మార్కులు వేయడానికి అసలు పవన్‌కల్యాణ్‌ ఎవరని ప్రశ్నించారు.

రాజధాని లేని రాష్ట్రానికి ఒక రూపు తీసుకొస్తోంది ఎవరు, 8 శాతం ఉన్న వృద్ధిరేటును 12శాతానికి తీసుకొచ్చింది ఎవరు, అని అడిగారు. రాష్ట్రంలో 16వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం వారికి కనబడటం లేదా, పోలవరం టెండర్లలో అవినీతి ఉంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. చంద్రబాబు పడే కష్టాన్ని విమర్శిస్తుంటే ఒక టిడిపి కార్యకర్తగా ఎంతో బాధపడ్డానని లోకే్శ్‌ తెలిపారు. బహిరంగ సభలో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వాటికి విలువేం ఉంటుందన్నారు. దివంగత ఏపీ సీఎం ఎన్టీఆర్‌కు తాను చెడ్డపేరును తీసుకొస్తున్నానని జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తనకు భాదను కల్గించాయిని, తాను పుట్టే సమయానికే ఏపీ రాష్ట్రానికి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారని లోకేష్ గుర్తు చేశారు. నాన్న చంద్రబాబుకు, తాత ఎన్టీఆర్ కు ఏనాడూ కూడ చెడ్డపేరు తీసుకురానని లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయినా ఎవరేమిటో ప్రజలకు తెలుసని, ఇకనైనా పవన్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు…..