నారా ఆస్తులు : 3 కోట్ల అప్పులో చంద్రబాబు..మనవడి వద్ద రూ 11 కోట్లు !

Saturday, December 9th, 2017, 01:25:36 AM IST

ఏడేళ్ల నుంచి తమ రాజకీయ కుటుంబం మాత్రమే ఆస్తుల వివరాలు ప్రకటిస్తోందని మంత్రి నారాలోకేష్ అన్నారు. తాజాగా ఆయన తన కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించారు. హెరిటేజ్ సంస్థని 1992 లో స్థాపించామని ఇప్పుడా సంస్ధ రూ 2600 కోట్ల టర్నోవర్ కు చేరుకున్నట్లు లోకేష్ అన్నారు. మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తుల విలువ కూడా మారుతూ ఉంటుందని లోకేష్ వెల్లడించారు. తాము ఎప్పటికప్పుడు మారిన మార్కెట్ విలువల ఆధారంగానే ఆస్తులు ప్రకటిస్తున్నామని లోకేష్ అన్నారు.

తన తండ్రి చంద్రబాబు పేరిట రూ 2.53 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపిన లోకేష్ అదే సమయంలో ఆయనకు అప్పులు కూడా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు రూ 3 కోట్ల వరకు అప్పు ఉన్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి పేరిట ఉన్న ఆస్తులని కూడా లోకేష్ ప్రకటించారు. తనయుడు దేవాన్ష్ పేరిట రూ 11.54 కోట్ల ఆస్తులు ఉన్నాయని లోకేష్ వ్యాఖ్యానించడం విశేషం.

తమ కుటుంబం హెరిటేజ్ వ్యాపారాన్ని పద్దతి ప్రకారం చేస్తోందని అన్నారు. అలా వ్యాపారం చేయడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. తమపై విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షం ముందుగా వారి ఆస్తులని వెల్లడించాలని డిమాండ్ చేశారు. జగన్ తన ఆస్తులని ఎప్పుడూ సొంతంగా ప్రకటించలేదని, సిబిఐ వారే ఆయన ఆస్తులని ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

నారా కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి..

* చంద్రబాబు నికర ఆస్తులు : రూ.2.53 కోట్లు

* భువనేశ్వరి నికర ఆస్తులు : రూ.25.41 కోట్లు

* లోకేశ్‌ నికర ఆస్తులు : రూ.15.21 కోట్లు

* బ్రాహ్మణి నికర ఆస్తులు : రూ.15.01 కోట్లు

* దేవాన్ష్‌ నికర ఆస్తులు : రూ.11.54కోట్లు

  •  
  •  
  •  
  •  

Comments