నారా లోకేష్‌కు ఊహించ‌ని షాక్.. అసలు మ్యాట‌ర్ ఇదే..!

Thursday, December 6th, 2018, 02:25:10 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి నారాలోకేష్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో బుధవారం రాత్రి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి వ‌చ్చిన లోకేష్ కాన్వాయ్‌ను కాలనీ వాసులు అడ్డుకున్నారు. స్థానిక మహిళలంతా క‌లిసి కాన్వాయ్‌కు అడ్డుగా రోడ్డు పై ఖాళీ బిందెలను ఉంచి నిరసన తెలుపుతూ అక్క‌డే కూర్చున్నారు.

ఇక‌ గత కొన్ని సంవత్సరాలుగా తాము తాగు నీటి సమస్యతో బాధపడుతున్నామని ఈ సందర్భంగా వారు లోకేష్ కి వివరించారు. బియ్య‌పుతిప్ప‌లో సుమారు 200 కుటుంబాలకు పైగా నివసిస్తుండ‌గా.. అక్క‌డ తాగునీటి సదుపాయం లేదని, ఉప్పు నీళ్ళు తాగాల్సి వ‌స్తోంద‌ని మంత్రి లోకేష్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాగే ప‌క్క గ్రామం నుండి పైపులైను ద్వారా నీరు స‌ర‌ఫరా అవుతున్న‌ప్ప‌టికీ, రెండురోజుల‌కు ఒకసారి అర‌గంట మాత్ర‌మే ఇస్తున్నార‌ని, అయితే త‌ర‌చూ ఆ పైపులైన్లు పాడై ఆ నీళ్ళు కూడా ఉప్ప‌గా ఉంటున్నాయని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి లోకేష్ హామీ ఇవ్వ‌డంతో అక్క‌డి స్థానికులు శాంతించి లోకేష్ కాన్వాయ్‌ని ముందుకుసాగ‌నిచ్చారు.