రాజధాని కోసం పర్‌ఫెక్ట్ ప్లాన్

Tuesday, September 23rd, 2014, 07:39:00 PM IST

Narayana
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర సర్కార్ కసరత్తుల్లో మునిగిపోయింది. రాజధాని నిర్మాణానికి సమగ్రమైన ప్రణాళిక రచించేందుకే పలు రాష్ట్రాల్లోని రాజధానులను సందర్శిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానుల నిర్మాణంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పులు ఏపీలో జరగకుండా చూస్తామని అన్నారు. నయా రాయ్ పూర్ తమను ఆకట్టుకుందని ఆయన చెప్పారు. ఏపీలో లాగే నయా రాయ్ పూర్ లో కూడా భూముల ధరలు ఆకాశాన్నంటాయని, అయినప్పటికీ ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం సమర్ధవంతంగా భూ సేకరణ జరిపిందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో పర్యటించి వచ్చిన మంత్రి.. సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాజధానుల నిర్మాణాలను పరిశీలించిన తాము… ఆయా రాష్ట్రాల్లో జరిగిన తప్పులు ఏపీలో జరగకుండా చూడాలని భావిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. ఏ రాష్ట్రంలో అయినా రాజధానిని సుమారు ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించారని తెలియజేశారు.

భూ సేకరణపై ప్రభుత్వ ఆలోచనలను నారాయణ వివరించారు. ల్యాండ్‌ పూలింగ్‌పై తగిన కసరత్తు చేసి.. నెల రోజుల లోపల పాలసీని ప్రకటించి, ఏడాదిలోపు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడ పరిధిలోనే నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, 50 వేల ఎకరాల వరకు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూసేకరణ జరుపుతామని మంత్రి నారాయణ తెలిపారు. భూ సేకరణ వల్ల రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని చెప్పారు. ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో రైతులకే లాభమని ఆయన తెలియజేశారు. అభివృద్ధి చేసిన తర్వాత పెరిగిన విలువలో భూమి యజమానులకు వాటా ఉంటుందని మంత్రి వివరించారు.