ఎమ్మెల్సీల‌కు మంత్రి ప‌ద‌వుల‌పై ఉత్కంఠ‌!

Thursday, January 10th, 2019, 10:25:49 AM IST

తెలంగాణలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి వర్గ విస్త‌ర‌ణ‌లో ఎమ్మెల్సీల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టే విష‌యంలో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఆశావ‌హుల నుంచి ఈ ద‌ఫా గ‌ట్టి పోటీ నెల‌కొడంతో మంత్రి వ‌ర్గ కూర్పు అంశం కీల‌కంగా మారింది. అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎమ్మెల్సీల మ‌ధ్య పోటీ మ‌రింత తీవ్రంగా వుండ‌టంతో ఇద్ద‌రి మ‌ధ్య స‌మాన‌త్వాన్ని పాటించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ గ‌ట్టి స‌వాల్‌గా మారే అవ‌కాశం వుందని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

గ‌త ప్ర‌భుత్వంలో 18 మంత్రుల‌కు గానూ ముగ్గురు ఎమ్మెల్సీల‌కు అవ‌కాశం క‌ల్పించారు. అయితే ఈ ద‌ఫా ఆ పోటీ అధికంగా వుండ‌టం, ఎమ్మెల్యేల నుంచి ఎక్కువ మంది పోటీప‌డుతుండ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంశం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. గ‌తంలో ఎమ్మెల్సీలుగా వున్న క‌డియం శ్రీ‌హ‌రి, మ‌హ‌మూద్ అలీ, నాయిని న‌ర్సింహారెడ్డిల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. అయితే ఈ ముగ్గురిలో మ‌హ‌మూద్ అలీ ఇప్ప‌టికే మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. నాయినికి ఈ ద‌ఫ మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. మిగిలింది క‌డియం శ్రీ‌హ‌రి. ఎస్సీ సామాజిక వ‌ర్గ నేత కావ‌డం, రాజ‌కీయ అనుభ‌వం వుండ‌టం, సీనియ‌ర్ నేత కావ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు ఈ ద‌ఫా కూడా మంత్రి వ‌ర్గం చోటు ద‌క్కుతుంద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

ఇక ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి అత్య‌ధిక మంది మంత్రి ప‌ద‌వి కోసం పోటీప‌డుతున్నారు. అందులో ఆరూరి ర‌మేష్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, దాస్యం విన‌య్ భాస్క‌ర్‌, రెడ్యానాయ‌క్‌ల పేర్లు ప్ర‌ధ‌మంగా వినిపిస్తున్నాయి. ఇందులో దాస్యం విన‌య్ భాస్క‌ర్ ఈ సారి గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వ‌రంగ‌ల్ వ‌ర్గాల స‌మాచారం. వీరంద‌రినీ సంతృప్తి ప‌రుస్తూ మంత్రి వ‌ర్గాన్ని కూర్చ‌డంలో గులాబీ నేత ఎలాంటి చాణ‌క్యాన్ని నెర‌పుతాడో చూడాలి.