ఎమ్యెల్యే కిషన్ రెడ్డి షాకింగ్ డెసిషన్….?

Monday, July 23rd, 2018, 01:46:47 PM IST

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులూ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఏ పార్టీల వైపు చూస్తారో అనేది చెప్పలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణప్రాంత బీజేపీ ఎమ్యెల్యే, మరియు ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అంబర్ పెట్ నియోజకవర్గ ఎమ్యెల్యేగా కొనసాగుతున్న అయన, రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామి అయ్యేలా, రానున్న ఎన్నికల్లో ఎంపీ గా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. అది కూడా హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గాన్ని ఆయన ఎంచుకున్నారని,

అందువల్లనే గత కొద్దిరోజులుగా అయన ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా మంచి పేరుని పొందిందని, మా పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మరియు పథకాలే మాకు రానున్న రోజుల్లో శ్రీరామరక్షగా నిలిచి మాకు మరొక్క సారి అధికారాన్ని కట్టబెడతాయని అయన అంటున్నారు. ఇకపోతే ఇప్పటికే ఆయన సతీమణి కావ్య కిషన్ రెడ్డి అంబర్ పెట్ ప్రాంతం నుండి ఎమ్యెల్యేగా నిలబడతారని, అందువల్లనే కొన్నాళ్ళనుండి ఆమె ఇంటినుండి ప్రజాక్షేత్రంలోకి వచ్చినట్లు సమాచారం.

2004లో అయన హిమాయత్ నగర్ నుండి, 2009 మరియు 2014లలో అంబర్ పెట్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఎమ్యెల్యేగా గెలిచారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉందని, గెలిచిన రెండుసార్లు కూడా అయన ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో చాలావరకు సక్సెస్ అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయమై మాట్లాడిన కిషన్ రెడ్డి మాత్రం, ఆయన సతీమణి రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని అన్నారని, అంతేకాక ఆయన ఎంపీగా పోటీచేసే విషయమై కూడా సమాధానమివ్వలేదని, మౌనం అర్ధ అంగీకారం కనుక, వస్తున్న వార్తలను బట్టి చూస్తే అది నిజమే అయివుండొచ్చని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ, ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో ఆగవలసిందే….

  •  
  •  
  •  
  •  

Comments