రోజా అరెస్ట్..బాబు మగాడేనా అంటూ ప్రశ్నించిన వైనం..!!

Saturday, February 11th, 2017, 01:15:33 PM IST


నగిరి నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే రోజాని శనివారం పోలీసులు అరెస్ట్ చేసారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంటరీ సదస్సులో పాల్గొనడానికి ప్రయత్నించిన ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రోజా నేటి ఉదయం 9 : 30 గంటలకు హైదరాబాద్ లో ట్రూజెట్ విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.విమానాశ్రయంలో దిగగానే ఆమెని విజయవాడ మహిళా ఎసిపి శ్రావణి, సిఐ సహేరా బేగం బృదం అరెస్టు చేసి గుంటూరు జిల్లా లోని మేడి కొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

విజయవాడలో మహిళా పార్లమెంటేరియన్ సదస్సు జరుగుతున్న తరుణంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకే రోజాని అరెస్టు చేసినట్లు పోలీస్ లు తెలిపారు. దీనిపై రోజా తీవ్ర విమర్శలతో చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు మగాడేనా అంటూ ఆమె ధ్వజమెత్తారు. అధికారులే తనని ఆహ్వానించి అరెస్టు చేయడం ఏంటని మండి పడ్డారు. బాబు మగాడే అయితే తాను, బృందా కారత్ లాంటి మహిళలను సదస్సుకు ఆహ్వానించి మాట్లాడించే వారని అన్నారు. వెంకయ్య నాయుడి కూతుర్ని, చంద్రబాబు కోడల్ని, కేసీఆర్ కూతుర్ని ఆహ్వానించడానికి ఇదేమైనా రాజకీయ సమావేశమా అంటూ ప్రశ్నించారు. రూ 13 కోట్ల అసెంబ్లీ డబ్బు వెచ్చించి అక్కడకు వచ్చిన వారి దుబారా ఖర్చుల కోసం వెచ్చిస్తున్నారని రోజా అన్నారు.