బ్రేకింగ్ న్యూస్ : మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఇక మరింత ఈజీ !!

Monday, March 19th, 2018, 05:00:47 PM IST

మనం ఒక టెలికం సర్వీసు వారు అందించే సేవలతో సంతృప్తి పడక పోతే వేరొక మొబైల్ ఆపరేటర్ కి మారుతుంటాం, దీనిని ఎంఎన్ పి అంటారన్నది తెలిసిందే.
ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎంఎన్ పి ( మొబైల్ నెంబర్ పోర్టబులిటీ) మరింత సులభంగా పూర్తి చేసుకునేలా తగిన మార్పులు చేర్పులు చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) భావిస్తోంది. ప్రస్తుతం ఎంఎన్ పి రిక్వెస్ట్ పంపిన వారం రోజుల్లోపు తనకు నచ్చిన ఇతర ఆపరేటర్‌కి మారిపోయే స్వేచ్ఛ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కల్పిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇకపై ఈప్రక్రియ చాలా సులభంగా మారనుంది. ప్రస్తుతం విదేశాల్లో ఈ ప్రక్రియ కేవలం కొద్ది గంటల్లో పూర్తవుతుంటే మన దేశంలో మాత్రం వారం రోజుల పాటు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో గణనీయంగా ఈ సమయాన్ని తగ్గించాలని ట్రాయ్ భావిస్తోంది. అందులో భాగంగా ఈ నెలాఖరుకు ఈ ప్రతిపాదనతో కూడిన కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది. వివిధ టెలికం ఆపరేటర్లు, వినియోగదారుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్. శర్మ ధృవీకరించారు

ఇప్పటికే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సంబంధించి గతంలో19 రూపాయలు ఉన్న ఛార్జీలను 79 శాతానికి పైగా తగ్గించి కేవలం నాలుగు రూపాయలు ట్రాయ్ మార్చిన విషయం గుర్తుండే ఉంటుంది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ చేసే సమయంలో వినియోగదారులు సాంకేతికంగా పెద్దగా సమస్యలు ఎదుర్కోవలసిన పనిలేకుండా, అంతా స్మూత్‌గా పూర్తయ్యేలా ట్రాయ్ ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఇవే గనుక అందుబాటులోకి వస్తే ఇక మన ఇష్టమొచ్చిన కంపెనీకి చాలా సులభంగా మారొచ్చు….