మోదీ, షాల‌కు పొగ‌పెడుతున్న గ‌డ్క‌రీ!

Friday, February 8th, 2019, 11:02:34 PM IST

ప్ర‌ధాని మోదీ, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షాల‌కు కాంగ్రెస్, దాని మిత్ర ప‌క్షాల నుంచే కాదు సొంత గూటి నేత‌ల నుంచి కూడా ద‌రువు మొద‌లైంది. ఇదిలా వుంటే సొంత గూటి పోరుకు కాంగ్రెస్ నేత‌లు మ‌రింత ఆజ్యం పోస్తున్నారు. స్వ‌ప‌క్షం బీజేపీలో వుంటూ నితిన్ గ‌డ్క‌రి, బాలీవుడ్ షాట్‌గ‌న్ శ‌త్ర‌ఘ్న‌సిన్హా న‌రేంద్ర మోదీపై తారా స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఇర‌కాటంలో ప‌డేస్తున్న విష‌యం తెలిసిందే. వీరిని పొగిడేస్తూ పుండుమీద కారం జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు కాంగ్రెస్ నాయ‌కులు. తాజాగా పార్ల‌మెంట్ సాక్షిగా బీజేపీ మాజీ అధ్య‌క్షుడు నితిన్ గ‌డ్క‌రీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డం మోదీకి, అమిత్ షాకు మంటపుట్టిస్తోంద‌ట‌.

గురువారం పార్ల‌మెంట్ జీరో అవ‌ర్‌లో ఈ అరుదైన స‌న్నివేశం జ‌రిగింది. కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీపై యూపీఏ ఛైర్‌ప‌ర్స‌న్ సోనియా గాంధీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. దేశంలో మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి గ‌డ్క‌రీ చేస్తున్న కృషి అమోఘ‌మ‌ని కొనియాడారు. ఈ సంద‌ర్భంలో కాంగ్రెస్ నేత‌లంతా బ‌ల్ల‌ల‌పై చేతులు చ‌రుస్తూ త‌మ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేయ‌డం విశేషం. అయితే ఈ ప‌రిణామం ప‌క్క‌నే వున్న మోదీకి, అమిత్ షాకు చిరాకు తెప్పించాయ‌ట‌. అయితే గ‌డ్క‌రీ మాత్రం త‌న‌పై కాంగ్రెస్ నేత‌లు కురిపించిన ప్ర‌శంస‌ల‌కు మురిసిపోయి త‌ను చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల కార‌ణంగానే త‌న‌ను అంతా అభినందిస్తున్నార‌ని చెప్ప‌డం విశేషం.

గ‌త కొంత కాలంగా నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌ధాని మోదీపై, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షాపై డైరెక్టుగానే విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల త‌న విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెంచిన ఆయ‌న బీజేపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయారు. పార్టీలో వుంటూనే ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌పై నితిన్ గ‌డ్క‌రి విమ‌ర్శ‌లు చేస్తున్నా ఆయ‌న‌ని ఏ ఒక్క బీజేపీ నేత విమ‌ర్శించ‌డానికి సాహ‌సించ‌క‌పోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.