టీడీపీ బ్లాక్ బెలూన్స్: అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మోడీ..!

Sunday, February 10th, 2019, 04:00:45 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనలో భాగంగా గుంటూరులో ప్రజాచైతన్య సభ జరుగుతోంది, ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు ఘాటైన వ్యాఖ్యలు చేసారు మోడీ. వెన్నుపోటు పొడవటంలో, మోసం చేయటంలో చంద్రబాబు ఘనుడని అన్నారు. తనకంటే సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏం చేసారని ప్రశ్నించారు, కూటములు పెట్టడం, ఎన్నికల్లో ఓడిపోవటంలో చంద్రబాబు తనకంటే సీనియర్ అని ఎద్దేవా చేసారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ప్రజలంతా తమకు నచ్చిన రీతిలో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ మేరకు మోడీకి వ్యతిరేకంగా విజయవాడలో “మోడీ నో ఎంట్రీ” అన్న నినాదాలతో హోర్డింగులు కూడా పెట్టారు.

మోడీ పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ విస్తృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది, అందులో భాగంగా చంద్రబాబు కూడా నల్ల చొక్కా ధరించారు. సభ జరుగుతున్న సమయంలో టీడీపీ శ్రేణులు నల్ల బెలూన్లను వదిలారు, దానిపై స్పందించిన మోడీ కౌంటర్ ఇచ్చారు. ఏదైనా శుభకార్యం చేపట్టే సమయంలో నల్ల చుక్క పెట్టుకోవటం ఆనవాయితీ అని, ఏపీకి వచ్చిన తనకు టీడీపీ వారు నల్ల బెలూన్లతో దిష్టి తీసారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్న అంటూ టీడీపీ నిరసనను తిప్పి కొట్టారు.