పాకిస్థాన్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన మోదీ

Sunday, September 25th, 2016, 10:10:36 AM IST

Modi
ఉరీ ఘటనాపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి బహిరంగ వేదికపై స్పందించారు. కోజికోడ్ లో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ మండలి సమావేశాలకు హాజరైన ఆయన ఉగ్రదాడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నిటికీ కారణమైన పాకిస్థాన్ ను నేరుగానే తిట్టిపోస్తూ, డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చారు. మోదీ మాట్లాడుతో ‘భారత సైనికులపై దాడి చేసి 18మంది సైనికులను చంపిన దారుణాన్ని భారత ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. పక్కదేశం పాక్ సహకారంతోనే ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపులోకి జొరబడ్డారు’ అని అన్నారు.

అలాగే ‘తమ ఆధీనంలో ఉన్న ఆక్రమిత కాశ్మీర్ ను బాగుచేసుకోలేదు, ఒకప్పుడు ఉన్న బంగ్లాదేశ్ ను కాపాడుకోలేకపోయారు. అలాంటి అసమర్థులు మీరు కాశ్మిర్ గురించి, భారత్ గురించి మాట్లాడతారా. ఇప్పటి వరకూ ఉగ్రవాదులు చేసిన దాడుల్లో 110 మంది ఉగ్రవాదులను సైన్యం చంపింది. ఈ దాడికి కూడా దెబ్బకి దెబ్బ తీసి తీరుతుంది. ఒక దేశ అభివృద్ధికి ముఖ్యమైన దౌత్య సంబంధాల పరంగా పాక్ ను ఏకాకిని చేస్తాం. సైనికుల ప్రాణ త్యాగాలు వృధా పోవు. న్యాయం జరిగి తీరుతుంది’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.